సూర్యాపేట జిల్లా:మద్యానికి బానిసైన ఓ భర్తను మద్యం తాగి ఆరోగ్యం పాడుచేసుకోవద్దని భార్య చెప్పినందుకు మద్యం మత్తులో ఉన్న భర్త భార్యను విచక్షణారహితంగా నరికిన దారుణ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం ముక్కుడుదేవులపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బొంత దేవేంద్ర,వీరయ్య అనే భార్యాభర్తలు కలిసి పనికి వెళ్లారు.
భర్త వీరయ్య మధ్యలోనే పని మానేసి గ్రామంలోకి వెళ్లి మద్యం సేవించి రావడంతో భార్య దేవేంద్ర మందలించింది.మధ్యాహ్న భోజన సమయంలో భర్త వీరయ్యకు అన్నం పెడుతూ మద్యం తాగి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని భార్య దేవేంద్ర రుసరుసలాడింది.
అప్పటికే మద్యం మత్తులో ఉన్న వీరయ్య ఆగ్రహంతో ఊగిపోయాడు.పని కోసం తెచ్చుకున్న గొడ్డలితో భార్య దేవేంద్రపై విచక్షణరహితంగా దాడి చేశాడు.
ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది.ఈ విషయాన్ని గమనించిన పక్క రైతులు 108 అంబులెన్స్ కి సమాచారం అందించారు.కానీ,108 రావడానికి ఆలస్యం కావడంతో ఆమెను ఆటోలో తీసుకొని ఆసుపత్రికి తరలించారు.భర్త చేతిలో గాయపడిన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆత్మకూర్ (ఎస్) ఎస్ఐ తెలిపారు.
పల్లె పట్నం అనే తేడా లేకుండా మారుమూల ప్రాంతాల్లో,తండాల్లో సైతం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారిస్తుండడంతో ప్రతీ ఒక్కరూ మద్యానికి బానిసలుగా మారి,మద్యం మత్తులో అనేక దారుణాలు దిగుతున్నారని మహిళా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం మద్యం అమ్మకాలపై టార్గెట్స్ పెట్టి మరీ అమ్మకాలు చేయిస్తుండడంతో వైన్స్ షాపుల యాజమాన్యం సిండికేట్ గా ఏర్పడి బెల్టుషాపులు ద్వారా మద్యం అమ్మకాలు చేయడంతోనే చిన్నా పెద్దా తేడా లేకుండా మద్యం అందుబాటులోకి వచ్చి యువత పెడదారి పడుతుందని,దాని వలన అనేక గ్రామాల్లో ఇలాంటి దారుణాలు వెలుగుచూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.