సనాతన భారతదేశంలో ప్రతి చోటే ఏవేవో సంప్రదాయాలు ఉంటాయి.అవి కొంత వింతగా కనిపించినా ఏళ్ల తరబడి వాటిని నిర్వహిస్తూ ఉంటారు.
కొందరు వాటిని మూఢ నమ్మకాలుగా కొట్టి పారేస్తుంటారు.అయితే అందులో ఏదో ఒక మర్మం ఉంటుందని వాటిని విశ్వసించే వారు చెబుతుంటారు.
ఇదే కోవలో ఏపీలోని కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం ఏటా నిర్వహిస్తుంటారు.పోలీసులు ఆంక్షలు విధించినా అవేమీ పట్టించుకోకుండా రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలతో కొట్టుకుంటారు.
కొందరికి తల పగిలి రక్తం ధారలుగా వస్తుంది.అయినప్పటికీ సైసై అంటూ ప్రత్యర్థి వర్గంపైకి దూసుకెళ్తుంటారు.
ఏటా ఇది కొందరికి ఎంతో వినోదాన్ని అందిస్తుంటుంది.అయితే గాయపడిన వారు మాత్రం ఆసుపత్రి కావాల్సిందే.
దీనిని తలపించే ఓ యుద్ధం మాదిరిగా జాతరలో జరుగుతుంటుంది.దాని గురించి తెలుసుకుందాం.
కర్ణాటకలోని మంగళూరులోని కటీలులో దుర్గాపరమేశ్వరి జాతరకు ఓ ప్రత్యేకత ఉంది.ఏటా జరిగే ఈ జాతరకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు తరలి వస్తుంటారు.
భారీ జనసందోహం మధ్య ‘అగ్ని కేళీ‘ సమరం జరుగుతుంది.ఆ జాతరలై ఈ ఘట్టమే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
ఇందులో భాగంగా అత్తూర్, కొడతూర్ గ్రామాల మధ్య పోరు జరుగుతుంది.కార్యక్రమంలో పాల్గొనే వారు ఒళ్లంతా పసుపు, కుంకుమ రాసుకుంటారు.
ఆ తర్వాత భగభగ మండే కాగడాలను చేతిలో పట్టుకుని ప్రత్యర్థి వర్గంపై దాడులకు దిగుతారు.వీరంతా ఒకరికొకరు పరిచయస్థులే.
తెల్లవారితే బావా, బాబాయ్, అన్న, మామ అని పిలుచుకునే వారే.అయితేనేం.
కాగడాల సమరంలో మాత్రం శత్రువుల మాదిరి భీకరంగా యుద్ధాన్ని తలపించేలా ఇరు వర్గాల మధ్య పోరు సాగుతుంది.
ఈ పోరులో చాలా మందికి దెబ్బలు తగులుతాయి.
కొందరికి అగ్ని కీలలు తగిలి కాలిన గాయాలతో ఇబ్బంది పడతారు.అయితే వారు ఎవరూ వైద్యుల వద్దకు వెళ్లరు.
కేవలం కుంకుమ పూసుకుని అలా ఉండిపోతారు.అదే తమ గాయాలను తగ్గిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు.
వీటన్నింటినీ చూసిన కొందరు ఇదేమి చోద్యం అని విస్తుపోతుంటారు.అయితే భక్తిభావం నిండుకున్న ఆ రెండు గ్రామాల ప్రజలు మాత్రం అవేమీ పట్టించుకోరు.
ఏటా అగ్నికేళీ సమరాన్ని నిరాటంకంగా నిర్వహిస్తుంటారు.కాగడాలతో కొట్టుకుంటూ తమ సనాతన ఆచారాన్ని కొనసాగిస్తూ ఉంటారు.