సూర్యాపేట జిల్లా: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో భాగంగా అమలు చేసిన రెండు లక్షల రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా అందరికీ మాఫీ చేయాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్ చేశారు.సోమవారం నూతనకల్ మండల కేంద్రంలో కామ్రేడ్ తొట్ల మన్సూరు స్మారక భవనంలో జరిగిన పార్టీ మండల కమిటీకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను గందరగోళ పరిస్థితికి తెస్తున్నారని,మంత్రులు ఇచ్చే ప్రకటనలో స్పష్టమైన వైఖరి లేదన్నారు.
రాష్ట్రంలో 40% రైతులకు మాత్రమే రుణమాఫీ అందిందని,అప్పు ఇచ్చినప్పుడు లేని షరతులు ఇప్పుడు ఎలా ఉంటాయని ప్రశ్నించారు.సాంకేతిక కారణాలతో తప్పించుకోవాలని చూస్తున్నదని విమర్శించారు.ఈ 29 న ఎమ్మార్వో ఆఫీస్ ల ముందు జరిగే ధర్నాలో రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.బొజ్జ శీను అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి,మండల నాయకులు అంజిపెళ్లి లక్ష్మయ్య, గాజుల జానయ్య,గాజుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.