సూర్యాపేట జిల్లా:అధికారం ఉంటే చాలు సర్పంచ్ అయినా సర్కార్ ను నడిపే మంత్రి,ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి అయినా అందరిదీ ఒకే దారి,ఓట్లేసి అధికారమనే అందలమెక్కిచ్చిన ప్రజలనే (ఓటర్లనే) రాజకీయ చదరంగంలో అధ:పాతాళానికి తొక్కేస్తారు.అదే నేటి భారతంలో రాజ్యమేలుతున్న “రాజకీయం” అని ఈ విషయం తెలిస్తే చెప్పకతప్పదు.
ఓ గ్రామ సర్పంచ్ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారుల సహాయంతో ఇళ్ళు నిర్మించుకున్న కాలనీ భూమిని పట్టా చేయించుకుని దర్జాగా రైతుబంధు కాజేస్తున్న సర్పంచ్ గారి కథ సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని బొప్పారం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.గ్రామ సర్పంచిగా ప్రజలకు మేలు చేయమని ఓటేసి అధికారం కట్టబెడితే,ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా గ్రామంలోని కాలనీకే ఎసరు పెట్టాడు సక్కదనాల సర్పంచ్.
ఆర్ఓఆర్ ద్వారా తన తండ్రి పేరున పట్టా చేసుకొని తండ్రి నుండి కొడుకు (సర్పంచ్) పట్టా చేసుకొని రైతుబంధు పొందుతున్నారని బాధితులు శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం గ్రామం వెంట ఉన్న 193 సర్వే నెంబర్ గల దేవులపల్లి సత్యనారాయణ రావు వద్ద 3ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం గ్రామస్తులు కొనుగోలు చేశామని, అందులో ఇళ్ళు నిర్మాణం చేసుకొని నివాసం ఉంటున్నామని,ఆ భూమిని గ్రామ కంఠంలోకి చేర్చక ముందే స్థానిక సర్పంచ్ తన తండ్రి లచ్చయ్య పేరున పట్టా చేసుకొని రైతుబంధు పొందుతున్నట్లు కలెక్టర్ కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.
అది చాలదన్నట్లు గ్రామ ఊర చెరువు శిఖం భూమిలో కొంత భూమిని ఆక్రమించుకొని అందులో అక్రమంగా ఇల్లు నిర్మాణం చేపడుతున్నట్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.అధికారం చేతిలో ఉన్నదని ప్రభుత్వ చెరువు శిఖం భూమిలో ఇల్లు నిర్మిస్తూ,పేదల ఇళ్ల స్థలంపై అక్రమంగా రైతు బంధు కాజేస్తున్న సర్పంచ్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పరాల భిక్షం,లింగయ్య,ఎడ్ల చంద్రయ్య,మంజుల,నీలమ్మ,భద్రమ్మ పాల్గొన్నారు.