సూర్యాపేట జిల్లా:వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ పై అన్ని రాజకీయ పార్టీల వైఖరి స్పష్టం చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు.రాజ్యాధికార సాధనకై ఏప్రిల్ 1 నుంచి నియోజకవర్గాల స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
బుధవారం చివ్వెంల మండలం గుంపుల గ్రామంలో ఏర్పాటు చేసిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల సంక్షేమాన్ని అన్ని రాజకీయ పార్టీలు విస్మరించాయని, వికలాంగులను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటూ ఉనికి లేకుండా చేశాయని ఆరోపించారు.చట్టసభల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండా వికలాంగుల సంక్షేమం తమ పార్టీతోనే సాధ్యమవుతుంది అంటూ ఊపదంపుడు ఉపన్యాసాలతో వికలాంగుల ఓట్లకు గాలం వేస్తూ, వికలాంగులకు పెన్షన్లు ఇస్తున్నాము అంటూ ప్రగల్భాలు పలుకుతూ,వికలాంగులను కేవలం పింఛన్ కే పరిమితం చేసి రాజ్యాధికారానికి దూరం చేస్తూ అన్ని రాజకీయ పార్టీలు పబ్బం గడుపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వికలాంగులకు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు చట్టసభల్లో రాజ్యాధికారం సాధించేంతవరకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తన పోరాటాన్ని కొనసాగిస్తుందని, వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ పై అన్ని పార్టీల వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ పై అభిప్రాయాన్ని వ్యక్తం చేయని పార్టీలపై త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.
వికలాంగులకు చట్టసభల్లో రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ఏప్రిల్ 1 నుంచి అన్ని నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కోల్లూరి ఈదయ్య బాబు,సంఘం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కుర్ర గోపి,సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మున్న మధు యాదవ్,సంఘం మండల అధ్యక్షుడు కోల్లూరి నాగరాజు,మహిళా నాయకురాలు బోల్క ఉప్పమ్మ,నాయకులు పబ్బు శంకర్,బుజ్జమ్మ,కోల్లూరి సురేష్,నాగయ్య తదితరులు పాల్గొన్నారు.