సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములను అధికార పార్టీ లేదా వారికి కొమ్ము కాసే ధనవంతులు కబ్జా చేసుకొని,కోట్ల విలువచేసే ప్రభుత్వ,ప్రజా ఆస్తులను కొల్లగోడుతున్నారని, ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా సూర్యాపేట జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు.బుధవారం ఆయన జిల్లా కేంద్రంలో సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా కార్యాలయం విక్రమ్ భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అధికారుల అండతో అధికార పార్టీ నేతలు,డబ్బు ఉండీ పలుకుబడి గలవారు, రియలట్టర్లు అసైన్డ్,దేవాదాయ,వక్ఫ్ భూములు కబ్జా చేసి వెంచర్లు వేసి,అడ్డగోలుగా అమ్ముకుంటూ కోట్లకు కోట్లు సంపాదిస్తన్నారని ఆరోపించారు.
వీరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ విధేయులుగా ఉంటూ వాళ్ల పబ్బం గడుపుకుంటున్నారని,అధికారులు డబ్బుకు ఆశపడి వాళ్లకు తొత్తులుగా మారి ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని,వీరి ఆగడాలను ప్రశ్నిస్తే వారిపైన దౌర్జన్యాలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.నిలువనీడ లేని నీరుపేదలకు దక్కాల్సిన ప్రభుత్వ భూములను బలిసినోళ్లంతా ఒక్కటై బరితెగించి దోచుకుంటుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.
ఇకనైనా ఉన్నతాధికారులు మేల్కొని,కబ్జాలకు గురవుతున్న భూములపై సమగ్ర విచారణ జరిపి, అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ,దేవాలయ, బంజరాయి,పోరంబోకు,అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకొని నీడలేని నిరుపేదలకు పంచి ఇవ్వాలని లేదా ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించాలని సూచించారు.టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రభుత్వ భూముల కబ్జాలే కొనసాగుతున్నాయని,అదే పరంపర సూర్యాపేట కూడా కొనసాగుతుందని అన్నారు.
అనేక మంది అధికార పార్టీ నాయకుల కబ్జాలో చిక్కుకున్న ప్రభుత్వ భూములన్నిటినీ వెలికి తీసి,భూమి లేని పేదలకు పంచాలని అధికారులను డిమాండ్ చేశారు.లేనియెడల సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా ఆధ్వర్యంలో వెలికి తీసి,భూముల్లో ఎర్ర జెండాలు పాతి,పేదలకు పంపిణీ చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా కన్వీనర్ కొత్తపల్లి రేణుక,జిల్లా నాయకులు అఖిల్,పట్టణ అధ్యక్షులు జీవన్, రాములు,మౌనిక,ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.