సూర్యాపేట జిల్లా:ఓ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య వచ్చిన వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది.ఆ పంచాయితీ విషయంలో పోలీసులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని మనస్థాపానికి గురైన ఓ వ్యక్తిని పోలీస్ స్టేషన్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన పోలీసులకు తలనొప్పిగా మారింది.
సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు,స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన గండ్ర వెంకటనర్సమ్మకు వెంకటరెడ్డి,సోమిరెడ్డి ఇద్దరు కుమారులు.తనకున్న పది ఎకరాలల్లో ఇద్దరికి నాలుగు ఎకరాల చొప్పున పంచిచ్చిన నర్సమ్మ,తన దగ్గర రెండు ఎకరాలను ఉంచుకుంది.
ఆ రెండు ఎకరాలను కూడా అన్నదమ్ములు చెరో ఏడాది సాగు చేసుకుంటున్నారు.దీనిలో భాగంగా ఈ ఏడాది చిన్న కుమారుడైన సోమిరెడ్డి ఆ భూమిలో వరి సాగు చేశాడు.
అయితే కోతకు వచ్చిన పంటను సోదరుడు వెంకటరెడ్డి తల్లి నర్సమ్మ సహకారంతో సోమిరెడ్డికి తెలియకుండానే కోత మిషన్,ట్రాక్టర్ల సహాయంతో కోసుకొని వెళ్లి అమ్ముకున్నారు.దీనిపై సోమిరెడ్డి గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌లో తల్లి నర్సమ్మతోపాటు సోదరుడు వెంకటరెడ్డి,ఆయన భార్య,కుమారుడు,పంట కోసి తరలించిన ట్రాక్టర్ యజమానిపై కూడా ఫిర్యాదు చేశారు.
బాధితుని ఫిర్యాదు మేరకు గరిడేపల్లి ఎస్సై కొండల్ రెడ్డి కేసు నమోదు చేశారు.ఇదిలా ఉంటే ఈ విషయంలో ట్రాక్టర్ యజమానిని పోలీసులు పిలిపించి మందలించినట్లు సమాచారం.
దీనితో ఇద్దరి అన్నదమ్ముల మధ్య వచ్చిన పంట వివాదంలోకి తనను లాగి,ట్రాక్టర్ స్వాధీనం చేసుకుని పోలీసులు వేధిస్తున్నారని,వారి వేధింపులు తట్టుకోలేక స్టేషన్ ఆవరణలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలుస్తోంది.వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతనిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.