సూర్యాపేట జిల్లా: సోషల్ మీడియాపై కాంగ్రెస్ పార్టీ పుల్ ఫోకస్ చేసిందని, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉన్నోళ్లకే పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కాశీనాధం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన హుజూర్ నగర్, కోదాడ సోషల్ మీడియా సోల్జర్స్ అవగాహన సదస్సు కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డితో కలిసి హాజరై మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోనే రెండు లక్షల మెజార్టీ ఈ రెండు నియోజవర్గాల నుంచి వచ్చిందని,పార్లమెంట్ మెంబర్షిప్ చేసింది కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లోనేనని, అయినా ప్రచారం చేయడంలో వెనుకబడ్డామని గుర్తు చేశారు.
ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడమే సోల్జర్స్ యొక్క పని అని,సోషల్ మీడియా గురించి ఇప్పుడే నేర్చుకుంటున్నానని,ఈ తరంలో సోషల్ మీడియాకు బలమైన రీచ్ ఉందని తెలిపారు.మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ మీడియాని మూసివేసి సోషల్ మీడియా ద్వారా గెలిచారన్నారు.
ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు ఒక సోషల్ మీడియా సోల్జర్ ని నియమించాలని,ఇది మండల గ్రామ శాఖ అధ్యక్షుల బాధ్యతని ఆదేశించారు.కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో ఒక్క ఎకరం కూడా ఎండిపోవద్దని అందుకు ప్రతి లిఫ్ట్ ను మరమ్మత్తులు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.2029లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఎవరు ఆపలేరని జోస్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో రెండు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.