సూర్యాపేట జిల్లా:రాష్ట్రవ్యాప్తంగా దళితులందరికీ ఒకేసారి దళితబంధు అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం పెన్ పహాడ్ మండల పరిధిలోని దూపహాడ్ గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రతి కుటుంబానికి భూమి ప్రధాన జీవనాధారమని,భూమి ఉంటే ఆత్మగౌరవంతో బ్రతక వచ్చునని అన్నారు.నేటి సమాజంలో 40 శాతం మందికి సెంటు భూమి లేక రెక్కల కష్టం మీద ఆధారపడి జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదలందరికీ భూ పంపిణీ చేయాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం చేయడం ఫలితంగా చట్టాలు వచ్చినా,ఆ చట్టాలు ఉన్నవాళ్లకి ఉపయోగపడుతున్నాయని అన్నారు.జిల్లాలో వేలాది ఎకరాలు ప్రభుత్వ, పంచరాయి,దేవాదాయ,అటవీ భూములు ఉన్నా పేదలకు పంచడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతో పేదల స్వాధీనంలో ఉన్న భూములను లాక్కోవడం సిగ్గుచేటన్నారు.రాష్ట్రంలో దళితులు 64 లక్షల 41వేలమంది ఉన్నారని,రాష్ట్రంలో సెంటు భూమిలేని దళితులు 9 లక్షల కుటుంబాలు ఉన్నాయని,వారికి మూడెకరాల భూమి ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ప్రభుత్వం పేదలకు భూములు పంచకుంటే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలే భూములు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారని,వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉధ్యక్షులు నారసాని వెంకటేశ్వర్లు,సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రణపంగ కృష్ణ,జిల్లా కమిటీ సభ్యులు గుంజ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.