సూర్యాపేట జిల్లా: నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు కింద ఉన్న పంట పొలాలు నీళ్ళు లేక ఎండిపోతున్నాయని, వెంటనే చెరువులను, కుంటలను నింపేందుకు సాగర్ నీటిని విడుదల చేయాలని కిసాన్ మోర్చా నేరేడుచర్ల మండల అధ్యక్షుడు తాళ్ల నరేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.నేరేడుచర్లలోని పలు ప్రాంతాల్లో ఎండి బీటలు బారిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలా ఈసారి కూడా వర్షాలు పడతాయని,ఆగస్టు చివరివరకైనా నాగార్జున సాగర్ కి నీల్లు వస్తాయనే ఆశతో బోరు బావుల కింద వీలైనంత వరకు రైతులు వరి సాగు చేశారన్నారు.
సకాలంలో వర్షాలు పడక సాగర్ కి నీళ్లు రాక రైతుల ఆశలు అడియాశలై పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.కొంతమంది రైతులు బోరు బావుల ఆధారంతో నాటుకున్న వరి పంటను బ్రతికించుకోవడానికి ఎన్నో తిప్పలు పడుతున్నారని, వర్షాలు లేక బోర్లు,బావులు సైతం అడుగంటడంతో పంటలు ఎండిపోయి బీటలు బారుతున్నాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి వెంటనే నాగార్జునసాగర్ లో ఉన్న నీటిని ఒక దఫా చెరువులను,కుంటలను నింపాలని డిమాండ్ చేశారు.
చెరువులు, కుంటలు నింపడం ద్వారా బోరు బావుల నీటి లభ్యత పెరిగి పంట పొలాలను కాపాడుకోవచ్చని తెలిపారు.