యాదాద్రి జిల్లా:రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షులు, సినీ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు.తెలంగాణలో పార్టీలో యువరక్తాన్ని ఎక్కించేందుకు జనసేన పార్టీ కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలో పర్యటించారు.ఆరు నెలల క్రితం ప్రమాదంలో మృతి చెందిన వలిగొండ మండలం గోపరాజుపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు కొంగర సైదులు కుటుంబ సభ్యులను లక్కారంలో కలసి పరామర్శించారు.
వారికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు.కుటుంబ సభ్యులతో మాట్లాడి తానున్నానంటూ ధైర్యాన్ని ఇచ్చారు.
అనంతరం విలేకరులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో పనిచేసి ప్రమాదంలో మృతి చెందిన సైదులు కుటుంబ సభ్యులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.అదే విధంగా తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతానికి చర్యలు చేపడతామని యువరక్తాన్ని ఎక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ ఉద్యమ సాధనలో అన్ని వర్గాల ప్రజలు ముందుండి పోరాడారని, అందులో ముఖ్యంగా ఉస్మానియా విద్యార్థుల పాత్ర క్రియాశీలకమని అన్నారు.రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ తరపున ఎక్కువ సంఖ్యలో యువత పోటీలో నిలిచి తన సత్తాను చాటుతుందని తెలిపారు.
గెలిచే అవకాశం ఉన్నా లేకున్నా తెలంగాణలో 20 శాతం పైగా అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు.తెలంగాణలో సామాజిక మార్పు కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందని అన్నారు.
త్వరలో తమ పార్టీ నాయకులతో కలసి తాను అన్ని నియోజకవర్గాల్లో తిరిగేలా ప్రణాళికలు రచిస్తున్నామని వెల్లడించారు.అంతకుముందు అభిమానులు భారీ గజమాలతో ఆయనకు స్వాగతం పలికారు.
ఆయన వెంట జనసేన పార్టీ నాయకులు సతీష్ రెడ్డి తదితరులు ఉన్నారు.అక్కడి నుండి వయా సూర్యాపేట మీదుగా సాయంత్రం కోదాడకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు గజమాలతో అభిమానుల భారీ స్వాగతం పలికారు.
జనసందోహం ఆయన నడుమ మాట్లాడలేకపోయారు.హుజూర్ నగర్ మండలం మర్రిగూడెంకు చెందిన జనసేన కార్యకర్త కడియం శ్రీనివాస్ గత తొమ్మిది నెలల క్రితం మృతి చెందగా ఆ కుటుంబాన్ని కోదాడకు పిలిపించి శ్రీనివాస్ తల్లి లక్ష్మమ్మకు కోదాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఎదురుగా గల ఓ నివాసంలో ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
ప్రస్తుతం జన సందడి వల్ల నీతో మాట్లాడే పరిస్థితి లేదని సమయం చూసుకొని హైదరాబాద్ కు గెలిపించి మాట్లాడతానని, కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చి వెళ్ళిపోయారు.కాగా పవన్ కళ్యాణ్ కోదాడకు వస్తున్నారనే వార్త గత నాలుగైదు రోజులుగా నియోజకవర్గం మాత్రమే కాకుండా పరిసర నియోజకవర్గాల్లో కూడా భారీగా ప్రచారం కావడంతో పవన్ కళ్యాణ్ ని చూసేందుకు ఉదయం 10 గంటల నుండి రోడ్లపై జనం బారులు తీరారు.హైదరాబాద్ నుండి బయలుదేరిన ఆయన మార్గమధ్యంలో సూర్యాపేట తదితర ప్రాంతాల్లో ఆయన కార్యకర్తలకు కుటుంబాలను పరామర్శించి కోదాడ కు చేరుకునే సరికి 4.30 దాటింది.పవన్ కళ్యాణ్ ను పట్టణ ముఖద్వారం కొమరబండ నుండి ర్యాలీగా వెళ్లి ఘన స్వాగతం పలికారు.వేలాది మంది అభిమానులు కేరింతలు కొడుతూ,పూలు చల్లుతూ పరామర్శ నివాసం వరకు తీసుకొచ్చారు.
అంతకుముందు ఆయన రెడ్ చిల్లి రెస్టారెంట్ వద్ద అభిమానులతో సందడి చేశారు.రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది అభిమానులు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు.
ఆయనతో కరచాలనం చేయాలని అభిమానులు సెక్యూరిటీని సైతం లెక్క చేయకుండా కారుపై దూసుకెళ్లారు.అభిమానుల సందడిని కట్టడి చేయడం పోలీసులకు సెక్యూరిటీ సిబ్బందికి సవాలుగా మారింది.
పరామర్శ నివాసం వద్ద క్రేన్ తో భారీ పూలదండను పవన్ కళ్యాణ్ కు వేశారు.ఆయన వాహనం పైకి అభిమానులకు ఊపుతూ వందనం చేశారు.
మహిళలు సైతం వందలాది మందిగా తరలి వచ్చి డాబాల పైకెక్కి పవన్ కళ్యాణ్ ని చూసి కేరింతలు కొట్టారు.ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఆ పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోదాడ పర్యటనలో అపశృతి,జనసేన కార్యకర్తకి ఆర్ధిక సహాయం చేయడానికి జనసేన అధినేత పవన్ వస్తున్న క్రమంలో కొమరబండ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.జనసేనాని కాన్వాయ్ బైక్ ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
కోదాడ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన నాయబ్ రసూల్,అరవింద్ గుర్తించారు.అరవింద్ కాలు ఫ్యాక్చర్ కాగా,నాయబ్ రసూల్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.