సూర్యాపేట జిల్లా:వార్డును అభివృద్ధి చేస్తాననే నమ్మకంతో వార్డు ప్రజలు తనపై నమ్మకం వుంచి కౌన్సిలర్ గా గెలిపించారని కానీ,ప్రజల సమస్యలు తెలియజేయడానికి తనకు మంత్రి జగదీష్ రెడ్డి అవకాశం కూడా ఇవ్వలేదని 20 వ,వార్డు కౌన్సిలర్,బీఎస్పి నాయకులు అన్నెపర్తి రాజేష్( Anneparthi Rajesh ) అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ లంబాడి బజార్ లో కూలడానికి సిద్దంగా వున్న పెంకుటిల్లులో నివాసం వుంటున్న డోలి (ఎస్టీ) కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వారి పరిస్థితిని గతంలో మంత్రి జగదీష్ రెడ్డి( Minister Jagdish Reddy ) దృష్టికి తీసుకెళ్ళినా ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం లభించలేదన్నారు.జమ్మిగడ్డలో( Jammigadda ) 200 ఇండ్లకు పట్టాలివ్వాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేదన్నారు.
నాలుగు సంవత్సరాల కాలంలో నాలుగుసార్లు కూడా మంత్రిని కలవలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.తన వార్డులో ఇండ్లు లేని నిరుపేదలు 30 మంది వున్నారని,వారి పరిస్థితి దయనీయమైన స్థితిలో వుందన్నారు.
మరుగుదొడ్డి సౌకర్యం లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో బీఎస్పి నాయకులు కుంభం నాగరాజు,కుంభం రాజేష్, వంశీ,నిహాల్ తదితరులు పాల్గొన్నారు.