సూర్యాపేట జిల్లా:రాష్ట్రంలో మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం సంపూర్ణంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రిని అధికారులను కోరారు.ఈ సందర్బంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యాశాఖ కార్యాలయంలో సూపరింటెండ్ కు అసోసియేషన్ నాయకులతో కలిసి వినతిపత్రం అందించారు.
ఈ సందర్బంగా యాదగిరి మాట్లాడుతూ ఎలాంటి వేతనాలు,రాబడి లేకుండా ప్రభుత్వానికి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు కేజీ నుండి పీజీ వరకు అన్నీ ప్రయివేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో పాఠశాల కళాశాలల్లో ఉచిత విద్య అందించాలన్నారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ జీవోను రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కొంత మంది పలుకుబడి ఉన్న జర్నలిస్టులకు మాత్రమే అమలు చేస్తున్నారని ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా నీతిగా నిజాయితీగా పనిచేసే జర్నలిస్టుల పిల్లలకు ఈ జీవో ఏమాత్రం అమలు జరగటంలేదన్నారు.
ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ జర్నలిస్టులు వెళ్లి ఆయా విద్యాసంస్థల వారిని బతిలాడవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇక నుంచైనా అన్ని ప్రయివేటు విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు కేజీ నుండి పీజీ వరకూ ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ఉచిత విద్యను అందించాలని ప్రభుత్వ అధికారులు నేరుగా పూర్తి వివరాలు సేకరించి ఆయా విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.
సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి దూపాటి శ్యాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ గౌసుద్దీన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి దుర్గం బాలు,రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మానుకొండ రాము,కోదాడ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి గట్టిగుండ్ల రాము,సూర్యాపేట మండల అధ్యక్షుడు కొరివి సతీష్ జాజిరెడ్డిగూడెం మండల అధ్యక్షుడు తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు.