సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల పైన పోలీసులు అమానుషంగా,ఇష్టానుసారంగా, వ్యవహరిస్తున్నారని,విలేకరుల పైన పోలీసుల వేధింపులు మానుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి శనివారం సాయంత్రం ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.రానురాను రాష్ట్రంలో జర్నలిస్టులకు భావప్రకటన స్వేచ్ఛ లేకుండా పోతుందని,పోలీసులను అడ్డం పెట్టుకుని కొంతమంది రాజకీయ నాయకులు జర్నలిస్టులపైన కక్ష్యపూరితమైన చర్యలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా ఆయన తాజాగా జరిగిన హైదరాబాద్ శేరిలింగంపల్లి దిశ తెలుగు దినపత్రిక ఇన్చార్జీ తుడుం భూమేష్ ను ఆయన పనిచేస్తున్న పత్రికలో వచ్చిన కథనానికి పోలీసులు నిజానిజాలు తెలుసుకోకుండా అరెస్టు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని,దీన్ని తాము అసోసియేషన్ తరపున ఖండిస్తున్నామని తెలిపారు.పోలీసులు భూమేష్ ఇంటికి సివిల్ డ్రస్సులో వెళ్లి చట్ట విరుద్ధంగా పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లడం తాము నూటికి నూరుపాళ్లు ఖండిస్తున్నామన్నారు.
జర్నలిస్టులు నిజానిజాలు లేకుండా తప్పుడు వార్తలు రాస్తే వారిపైన వచ్చిన ఫిర్యాదును బట్టి నడుచుకోవాల్సిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదన్నారు.ఇప్పటికైనా పోలీసులు ఉచితంగా ప్రజాసేవ,ప్రభుత్వ సేవ చేస్తున్న జర్నలిస్టులకు సహకరించాలని తెలిపారు.
తమ చేతుల్లో లాఠీలు,చట్టం ఉంది కదా అని జర్నలిస్టుల పైన అనవసరమైన దాడులకు దిగితే తాము రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు,రాస్తారోకోలకు,బంద్ లకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వారిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని అలాంటి వారిని విధుల నుండి తొలగించాలని కోరారు.
శేరిలింగంపల్లి ఇన్చార్జీ భూమేష్ రాయని వార్తను అతనే రాశాడని కక్ష పూరితంగా పోలీసులు తీసుకెళ్లి ఇబ్బందులు పెట్టడం జర్నలిస్టులను అవమానించడమే అన్నారు.కుటుంబ సభ్యులకు గానీ,తాను పనిచేస్తున్న సంస్థకు గానీ, తెలపకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 41 (ఎ) సి అర్ పీ సి నోటీసులు ఇవ్వకుండా ఉదయాన్నే ఇంటి నుంచి బలవంతంగా ఎత్తుకెళ్లడం చట్టవిరుద్దమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
మూడు ద్విచక్ర వాహనాలపై సివిల్ డ్రెస్‌లో భుమేష్ నివాసానికి చేరుకున్న పోలీసులు బృందం అతని ఫోన్ లాక్కొని సంఘవిద్రోహశక్తిని తీసుకెళ్లినట్టు పోలీస్ స్టేషన్ కు తరలించడం అమానుషమన్నారు.వార్త ప్రచురితమైనప్పడు సదరు వార్త డేట్‌లైన్‌ను పరిశీలించకుండా పోలీసులు కక్షపూరితంగా రాజకీయ వత్తిడులకు తలవగ్గి నచ్చని విలేకర్లను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసుల్లో ఇరికించడం మంచిది కాదని హితవు పలికారు.
సమగ్ర విచారణ జరుపకుండా ఏకపక్షంగా పోలీసులు ప్రవర్తించినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.బాధ్యతగల పోలీసులు ఇలా ప్రవర్తించడం హేయమైన చర్య అన్నారు.
విలేకర్లపై అక్రమ కేసులు బనాయించడం మానుకొనని యడల రాష్ట్రవ్యాప్తంగా అన్ని జర్నలిస్ట్ సంఘాలతో కలుపుకొని ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామి ఆయన హెచ్చరించారు.







