పనులలో ఎక్కడ కూడా రాజీ పడొద్దు.పనులను పరిశీలినపై ఆకస్మిక తనిఖీలు.
రాష్ట్ర విద్యా శాఖా జాయింట్ సెక్రటరీ హరిత.
సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు-మనబడి పథకం కింద జిల్లాలో మొదటి విడతలో మంజూరైన 329 పాఠశాలల్లో పలు పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యా శాఖ జాయింట్ సెక్రటరీ హరిత అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో మనఊరు-మనబడి పథకం కింద మంజూరై చేపట్టిన పనులపై విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తో కలసి ఆమె పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాకు ఇప్పటికే రెండు కోట్లు రూపాయలు అడ్వాన్స్ గా అందించామని తెలిపారు.
ప్రభుత్వ మార్గదర్శకాలను లోబడి సూచించిన 12 అంశాలకు లోబడి పనులు ఉండాలని,చెల్లింపులలో ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండొద్దని సూచించారు.జిల్లాలో ఇప్పటికే 90 పాఠశాలలో పనులు జరుగుతున్నాయని మిగతా పాఠశాలలో కూడా ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని సూచించారు.
రాష్ట్ర స్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే సత్వరమే పరిశీలించి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.ప్రధానోపాధ్యాయులు,ఎస్ఎంసి కమిటీ సభ్యులకు పనుల చెల్లింపుపై పూర్తిస్తాయిలో అవగాహన కల్పిస్తామన్నారు.త్వరలో జిల్లాలో అన్ని పాఠశాలలో అభివృద్ధి పనులను రాష్ట్రస్థాయి అధికారులు పరిశీలించడం జరుగుతుందన్నారు.
ఎంపికచేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ లు, సహాయక ఇంజినీర్లు,ఈఈలు,డిఈఈలు, ఎంఈఓలు,ఎంపికైన పాఠశాలల అభివృద్ధికి సమన్వయంతో కలసి పనిచేయాలని సూచించారు.అన్ని పాఠశాలల్లో రూ.30 లక్షల లోపు పనులకు సత్వరమే జిల్లా స్థాయిలో అనుమతులు ఇవ్వాలని, అలాగే రూ.30 లక్షల పై పనులకు టెండర్లు ద్వారా చేపట్టాలని ఆదేశించారు.అనంతరం ఎంపికైన పాఠశాలల వారీగా పనుల పురోగతిపై సమీక్షించారు.పాఠశాలల పనుల పురోగతి,సాంకేతిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో విద్య శాఖ ఏఎస్ పిడి రమేష్,డీఈఓ అశోక్,టీడబ్ల్యూఐడీసీ ఈఈ అనిత,పి.ఆర్.ఈఈ శ్రీనివాసరెడ్డి,ఎస్ఎంసి కమిటీ సభ్యులు,ఎంఈఓలు,హెచ్ఎంలు,సంబంధిత శాఖల ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.