సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో వరి ధాన్యము కొనుగోలుకు అంతా సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు రైతుల నుండి నేరుగా ధాన్యం కొనుగోలు చేసి మధ్య దళారుల ప్రమేయం లేకుండా డబ్బులను వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తామన్నారు.శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై రెవెన్యూ,వ్యవసాయ శాఖ,సివిల్ సప్లై,జిల్లా గ్రామీణాభివృద్ధి,సహకారశాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావుతో కలసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ఐకేపి ద్వారా 200,సహకార సంఘాల ద్వారా 127 మొత్తం 327 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని,ఈ కేంద్రాలు శనివారం నుండే ప్రారంభమవుతాయని సోమవారం నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తాయన్నారు.
జిల్లాలో ఈ సీజన్లో 5 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేస్తున్నామని.అంతకంటే ఎక్కువ వచ్చిన కొనుగోలు చేస్తామన్నారు.రైతులు మద్దతు ధర కంటే తక్కువకు ధాన్నాన్ని దళారులకు విక్రయించి మోసపోకూడదని,ఇప్పటికే దళారులపై నిఘా ఉంచామని అన్నారు.తమ దగ్గరలో ధాన్యం కొనుగోలు కేంద్రములో కనీస మద్దతు ధరపై విక్రయించాలని తెలిపారు.ప్రభుత్వం వరి ధాన్యము కనీస మద్దతు ధర‘ఏ’గ్రేడ్ రకానికి క్వింటాల్ ఒక్కింటికి రూ.1,960,కామన్ రకం క్వింటాల్ ఒక్కింటికి రూ.1,940గా నిర్ణయించదని తెలిపారు.రైతులు తెచ్చే వరి ధాన్యము ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలని,తేమశాతం 17కు మించరాదని సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు విధిగా సెంటర్ల వద్ద టెంట్,త్రాగునీరు,కుర్చీలు, తాత్కాలిక టాయిలెట్లు,సీనియార్టీ రిజిస్టర్, తేమశాతం రిజిస్టర్,టార్పాలిన్‌లు,తేమశాతం కొలిచే పరికరం,ప్యాడి క్లీనర్లు,ఎలక్ట్రానిక్ కాంటాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.రైతు సెంటర్లకు తెచ్చిన ధాన్యాన్ని నిర్వాహకులు సీనియారిటీ ప్రకారం కొనుగోలు చేయాలని,రైతులు తమ పట్టాదారు పాస్ బుక్,బ్యాంకు పాస్ బుక్,ఆధార్ కాపీల జిరాక్స్ విధిగా కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు అందజేయాలని తెలిపారు.
రోజువారీ కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు అదే రోజు ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలని నిర్వహకులను ఆదేశించారు.తప్పుడు ట్రక్‌షీట్లను సృష్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయబడునని హెచ్చరించారు.
ప్రతి మండలంలో స్థానిక తహశీల్దార్ పర్యవేక్షణలో కొనుగోలు జరుగుతాయని,ఆర్.డి.ఓలు విధిగా కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని తెలిపారు.ఇతర రాష్ట్రాల ధాన్యం జిల్లాలో రాకుండా చెక్‌పోస్టుల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాటు చేయబడిదన్నారు.
ట్యాబ్ ఎంట్రీ ఎప్పడికప్పుడు పూర్తి చేయాలని,జిల్లాలో గన్నీ బ్యాగుల కొరత లేదన్నారు.కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు.ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశామని ఏదైన సమస్యలు ఉంటే కంట్రోల్ రూం నెంబర 6281492368ను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట,కోదాడ, హుజుర్‌నగర్ ఆర్‌డివోలు రాజేంద్రకుమార్, కిషోర్‌కుమార్,వెంకారెడ్డి,జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్,పిడి డిఆర్‌డిఏ కిరణ్‌కుమార్, డిఎస్‌వో విజయలక్ష్మి,డిఎం సివిల్ సప్లయ్ రాంపతి నాయక్,వివిధ శాఖల అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.