నకిలీ బంగారంతో తుంగతుర్తి అరవపల్లి, మద్దిరాల మండల పరిసర గ్రామాలలో తిరుగుతూ తక్కువ ధరకు బంగారం ఇస్తామని,తక్కువ బంగారానికి ఎక్కువ బంగారం ఇస్తామని నమ్మించి వారి వద్ద ఉన్న నకిలీ బంగారాన్ని ప్రజలకు ఇచ్చి తనిఖీ చేసుకోమని చెప్పి తిరిగి రెండు రోజుల తర్వాత వెళ్లి నకిలీ బంగారాన్ని ప్రజలకు ఇచ్చి డబ్బు,బంగారు ఆభరణాలను దోచుకెళ్తున్న రెండు అంతరాష్ట్ర ముఠాలను తుంగతుర్తి పోలీసులు అరెస్టు చేశారు.బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుల వివరాలు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ బంగారంతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న మోసగాళ్ల ముఠాను పట్టుకోవడంలో బాగా పనిచేసిన సూర్యాపేట డిఎస్పి నాగభూషణం, తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున, తుంగతుర్తి ఎస్ఐ డానియల్,మరియు వారి టీంలను ఎస్పీ అభినందించారు.ఇందులో ముగ్గురు సభ్యులు గల ముఠా నకిలీ బంగారం ముద్దలను చూపించి ప్రజలను మోసం చేస్తుండగా,ఇద్దరు సభ్యులు గల మరో ముఠా వారు మా వద్ద తవ్వకాలలో దొరికిన పురాతన బంగారం గొలుసులు ఉన్నదని ప్రజలను మోసం చేస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నరు.
ఇందులో ఇద్దరు సభ్యుల ముఠా సభ్యులను మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో తుంగతుర్తి తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తూ వెలుగుపల్లి గ్రామ ఆర్చి వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, వీరు చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పచ్చి రాజపురం గ్రామానికి చెందిన నక్క మత్తయ్య ( 22),డబ్బా యాకోబు (20)గా గుర్తించడం జరిగిందన్నారు.ముగ్గురు సభ్యులు గల ముఠా పట్టుబడి బుధవారం ఉదయం 8 గంటల సమయంలో తుంగతుర్తి ఎస్ఐ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అన్నారం గ్రామ అడ్డ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని,వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చామర గ్రామానికి చెందిన గంజి పద్మ అలియాస్ పెద్దింటమ్మ అలియాస్ జయమ్మ(36),కుంచాల శ్రీను(50),బత్తుల విజయ్ (35)గా గుర్తించామన్నారు.ముగ్గురు సభ్యుల ముఠా నేర విధానం ముగ్గురు ముఠా సభ్యులు 20 రోజుల క్రితం వెలుగుపల్లి గ్రామంలో సోమయ్య అనే వ్యక్తి ఇంట్లో గది కిరాయికి తీసుకొని సుతార్ పని చేస్తున్నామని నమ్మించి, చుట్టుపక్కల గ్రామాలను తిరుగుతూ ఫిబ్రవరి 21వ తేదీన నిందితులు పద్మ, విజయ్ ఇద్దరు భార్యాభర్తల మాదిరిగా మోటార్ సైకిల్ పై మద్దిరాల గ్రామానికి వెళ్లి సైదులుకు మాయమాటలు చెప్పి నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారం అని చెప్పి నమ్మించి సైదులు భార్య మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు పూసల తాడును దొంగలించారని,మరల 24వ తేదీ ఫిబ్రవరి రోజున పద్మ,విజయ్ ఇద్దరూ అక్కా తమ్ముడు మాదిరిగా మోటార్ సైకిల్ పై వెలుగుపల్లి గ్రామంలో తూము లక్ష్మి ఇంటికి వెళ్లి నకిలీ బంగారం బిల్లలు నాలుగు ఇచ్చి ఆమెకు అసలు బంగారమని మాయమాటలు చెప్పి నమ్మించి డబ్బులు అవసరం ఉన్నదని 1.8 లక్షల మగను మోసపూరితంగా తీసుకొని వెళ్ళిపోయారని,మార్చి 6వ తేదీన పద్మ,కుంచాల శ్రీను ఇద్దరు మోటార్ సైకిల్ పై అరవపల్లి మండలం గొల్లపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి 365 సపోటా పండ్లు అమ్ముతున్న వీరమ్మకు మాయమాటలు చెప్పి నమ్మించి ఆమెకు నకిలీ బంగారం ఇచ్చి ఆమె వద్ద 50 వేల రూపాయలు తీసుకొని వెళ్ళిపోయారని వివరించారు.వీరి ముగ్గురు ఈ రకమైన నేరాలకు పాల్పడినారని గుర్తించడం జరిగినదని,వీరిపై మద్దిరాల మరియు అరవపల్లి పోలీస్ స్టేషన్లో నందు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.ఈ ముగ్గురు సభ్యులు గల ముఠా నుండి 2 లక్షల 30 వేల రూపాయల నగదు, నాలుగు తులాల బంగారము,మరో 500 గ్రాముల నకిలీ బంగారం ముద్దలను,మూడు సెల్ ఫోన్లు,రెండు బైకులను కూడా స్వాధీనం చేసుకున్నమన్నారు.
ఇద్దరు సభ్యులు గల ముఠా నేర విధానం నక్క మత్తయ్య,డబ్బా యాకోబు ఇరువురు వారం రోజులుగా నకిలీ బంగారం గొలుసు తమ దగ్గర పెట్టుకుని వాటిని అసలు బంగారమని చెప్పి నమ్మించి మోసపూరితంగా డబ్బులు వసూలు చేయుటకు తిరుగుతున్నట్లు గుర్తించడం జరిగిందని, సుమారు 6 నెలల క్రితం ఏనేకుంట తండాకు చెందిన సపావత్ వెంకన్న ను అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి పిలిపించుకొని అతని వద్ద ఐదు లక్షల రూపాయల నగదు తీసుకొని నఖిలి బంగారు గొలుసు ఇచ్చినట్లు విచారణలో అంగీకరించారని,అట్టి నేరంలో వీరితో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహేష్ అనే అతను కూడా ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు.వీరు ఇద్దరు వెంకన్నను మోసం చేసినట్లుగా ప్రజలను మోసం చేసి డబ్బు,నగదు దోచుకోవాలన్న ఉద్దేశంతో వీరు మరల వచ్చినట్లు గుర్తించామని,ఇద్దరు సభ్యుల ముఠా నుండి లక్ష రూపాయల నగదు రెండున్నర కేజీలు గల నకిలీ బంగారం గొలుసులను గుర్తించి స్వాధీనం చేసుకోగా, మహేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని, ఇతనిని పట్టుకోవడం కోసం టీం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ఇలాంటి ఎవరైనా వస్తే డయల్ 100 కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు.