సూర్యాపేట జిల్లా: తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను తెలంగాణ ప్రభుత్వమే నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు సాయుధ పోరాట ఉత్సవాలలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ధర్మభిక్షం భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరి కామ్రేడ్ అమరజీవి ధర్మభిక్షం విగ్రహానికి సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లుతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన విరోచిత పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటమని ఈ పోరాటంలో 4500 మంది ప్రాణ త్యాగాలు చేశారని, పదివేల ఎకరాల భూమిని పంచి గ్రామ స్వరాజ్యాలు స్థాపించిన ఘనత కమ్యూనిస్టులకే దక్కిందని అన్నారు.
నిరంకుశ నిజాం పాలనలో దొరలు, జమీందారులు, జాగిర్దారుల,నిర్బంధ పనులతో ప్రజలను హింసించి ప్రాణాలను తీసిన నరహంతక పాలనను అంతమొందించించడం జరిగిందని,తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసిన ఘనత కమ్యూనిస్టు అమరవీరులదని,కానీ,నేటి పాలకులు దానిని స్మరించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేదని, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం హిందూ ముస్లిం తగాదాగా చిత్రీకరించి చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు.
నేటి తరాల వారికి అర్థమయ్యేలా పాఠ్యాంశాలలో సాయుధ పోరాట చరిత్రను చేర్చి అందించాలని వారి ఆశయ సాధన కోసం ముందుకు పోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస్, ఎస్కే లత్తు, పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు,ఏఐటియుసి గౌరవాధ్యక్షుడు చామల అశోక్, బొమ్మగాని శ్రీనివాస్, ఏఐటియుసి ప్రాంతీయ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపగాని రవికుమార్,ఏఐవైఎఫ్ పట్టణ కమిటీ సభ్యులు శ్రీకాంత్, హరి, సైదులు, నాగరాజు, టైలరింగ్ యూనియన్ అధ్యక్షుడు దీకొండ శ్రీనివాస్,రవి, రమేష్,రేగట్టి లింగయ్య, పొదిల లింగయ్య,రిక్షా యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పెండ్ర కృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.