సాధారణంగా మనం ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు ఇంటికి ప్రధాన ద్వారం నిర్మించే సమయంలో గడప క్రింది భాగంలో నవరత్నాలు, పంచలోహాలు, నవధాన్యాలను వేసి గడపను కూర్చోపెడతారు.ఈ విధంగా ఇంటికి సింహద్వారం అయినా గడప దైవ సమానంగా భావించి నిత్యం పూజలు చేస్తాము.
ఈ విధంగా హిందువులు ఎంతో దైవ సమానంగా భావించే గడపను తొక్క కూడదని, గడప పై కూర్చో కూడదని చెబుతుంటారు.ఈ విధంగా గడప ఎదురుగా కూర్చోవడం వల్ల మన ఇంట్లోకి వచ్చేటటువంటి లక్ష్మీదేవికి మనం అడ్డుగా ఉంటామని పెద్దలు చెబుతారు.
అదేవిధంగా మన కుటుంబం, కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలంటే తప్పనిసరిగా ఇంటి ఇల్లాలు చేయాల్సింది రెండు పనులు.ఒకటి మన ఇంటి ఇలవేల్పుని పూజించడం, అదేవిధంగా నిత్యం గడపకు పూజ చేయటం.
సాధారణంగా మనం పండుగల సమయాలలో గడపకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి, మామిడి తోరణాలు కట్టి, పువ్వులతో అలంకరణ చేస్తాము.ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆహ్వానం పలికినట్టు, అదే విధంగా ఎటువంటి అమంగళం గడప దాటి లోపలికి రాకుండా ఉండటానికి హెచ్చరికగా భావిస్తాము.
ఎంతో పవిత్రమైన ఈ గడపకు వివాహం చాలా ఆలస్యం అయ్యే అమ్మాయిలు 16 రోజులపాటు పూజలు చేయడం వల్ల వారికి కల్యాణ ఘడియలు దగ్గరపడతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.మరి 16 రోజుల పాటు గడపకు ఏ విధంగా పూజ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

ప్రతిరోజు ఉదయం మూడు గంటలకే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం చేసి గడపకు పూజ చేయాల్సి ఉంటుంది.అయితే 16 రోజులు తప్పనిసరిగా ఈ పూజను చేయాలి.మొదట గడపను మూడుసార్లు కడగాలి.ముందుగా నీటితో శుభ్రపరచాలి.రెండవ సారి పాలతో గడపను మొత్తం శుభ్రం చేయాలి.ఇక చివరిగా మూడవ సారి నీటితో కడగటం వల్ల గడపకు అభిషేకం చేసినట్లు అవుతుంది.
తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించి.ఈ విధంగా అలంకరించిన తర్వాత ఒక దీపపు ప్రమిదలో ఆవు నెయ్యి వేసి మూడు వత్తులను వేసి వెలిగించాలి.
అదేవిధంగా మరొక పళ్లెంలో అటుకులు బెల్లం తాంబూలం పెట్టి ముందుగా వినాయకుడికి పూజ చేసి తమకు మంచి సంబంధాలు దొరకాలని నమస్కరించాలి.ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం, వెంకటేశ్వర అష్టోత్తరం చదువుకుని హారతి ఇవ్వాలి.
ఈ విధంగా గణపతి పూజ చేసిన తర్వాత దీపం కొండెక్కితే వాటిని తీసి పక్కన పెట్టాలి.అయితే పూజ చేసిన అనంతరమే నిద్రపోకూడదు.
ఈ విధంగా 16 రోజుల పాటు చేయడం వల్ల వివాహ గడియలు దగ్గర పడతాయి.అయితే మన ఇంట్లో ఏ సమస్య ఉన్నా కానీ ఆ మహిళలు ఈ విధంగా గడపకి 16 రోజులపాటు పూజ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.
పెళ్లి కాని అబ్బాయిలు వారికి సంబంధాలు కుదరకపోతే తన తల్లి అబ్బాయికి సంబంధించిన వస్త్రాన్ని తన భుజంపై వేసుకుని పూజ చేయటం వల్ల తన కొడుకు పెళ్లి ఘడియలు దగ్గర పడతాయి.