ఇటీవల తమిర్ ఒహయాన్( Tamir Ohayon ) అనే ఇజ్రాయెలియన్‌కు ఐర్లాండ్‌లో( Ireland ) ఊహించని షాక్ తగిలింది.డన్ లయోగైర్ ప్రాంతంలోని హార్డీస్ బార్‌లో ఇద్దరు మహిళలు ఆయన్ని చుట్టుముట్టి అవమానించడమే కాకుండా, ముఖంపై ఉమ్మి వేశారు.
ఈ దారుణానికి ఒడిగట్టిన మహిళలు జైనా ఇస్మాయిల్, లెనా సీలే అని గుర్తించారు.వీళ్లిద్దరూ పాలస్తీనాకు( Palestine ) మద్దతుగా నిరసనలు, కార్యక్రమాలు చేసేవాళ్లని తెలుస్తోంది.
వ్యాపార పనుల మీద డబ్లిన్( Dublin ) వచ్చిన తమిర్ ఈ ఘటనను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.వీడియోలో ఆ మహిళలు “జియోనిస్టులకు ఐర్లాండ్‌లో స్థానం లేదు” అని గట్టిగా అరుస్తూ కనిపించారు.
ఆ తర్వాత వారిలో ఒకరు తమిర్‌పై ఉమ్మి వేశారు.
అసలు గొడవ వీడియో తీయకముందే మొదలైందని తమిర్ చెప్పాడు.
ఒక మహిళ కెమెరాతో తన దగ్గరకు వచ్చి తన పేరు, తాను బస చేసిన హోటల్, డబ్లిన్‌కు ఎందుకు వచ్చాడో వంటి వ్యక్తిగత విషయాలన్నీ చెప్పిందని వాపోయాడు.
“చాలా నిమిషాలపాటు నన్ను వేధించారు, కానీ ఎవ్వరూ ఆపడానికి ముందుకు రాలేదు.ఇది ఒక రకమైన టెర్రరిజం లాంటి చర్య, అందరూ సైలెంట్‌గా చూస్తూ ఉండిపోయారు” అని తమిర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
పోలీసులకు సాక్ష్యం కోసం తమిర్ వీడియో తీశాడు.
కానీ పోలీసులు మాత్రం రెండు గంటల తర్వాత వచ్చారని, వచ్చిన పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదని తమిర్ ఆరోపించాడు.భయంతో హోటల్ గదిలో తలుపులు వేసుకుని కూర్చున్నానని, ఇకపై ఐర్లాండ్‌కు ఎప్పటికీ రానని తేల్చి చెప్పాడు.
ఇదిలా ఉండగా, లెనా సీలే అనే మహిళ మాత్రం తమ చర్యలను సమర్థించుకుంది.తమిర్ గతంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ( IDF ) లో పనిచేయడం వల్లే తాము నిలదీశాము అని చెప్పింది.వెస్ట్ బ్యాంక్‌లోని హెబ్రోన్ నగరంలో తమిర్ పనిచేసినట్టు సమాచారం.అంతేకాదు, ఇంతకుముందు ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో ఆ ప్రాంతాన్ని “ఇజ్రాయెల్” అని ట్యాగ్ చేశాడని కూడా ఆరోపించింది.ఆ పోస్ట్ ఇప్పుడు డిలీట్ చేశారు.
“ఇజ్రాయెల్ సైనికులకు లేదా జియోనిస్ట్ ఏజెంట్లకు ఐర్లాండ్‌లో వెల్కమ్ లేదు.వాళ్లను బయటపెట్టి, నిలదీయడం యాక్టివిస్టుల బాధ్యత” అని లెనా సీలే తెగేసి చెప్పింది.తమిర్ గతంలో గాజా ప్రజల గురించి తప్పుగా పోస్టులు పెట్టాడని, తాము హింస చేయలేదని, అది కేవలం మాట్లాడటం మాత్రమే అని కూడా ఆమె వాదించింది.
స్థానిక కౌన్సిలర్ జిమ్ ఓ’లీరీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.ఇది “పూర్తిగా యూదు వ్యతిరేకత” అని మండిపడ్డారు.
డబ్లిన్‌లోని యూదు సమాజం “ఒంటరిగా, ఒత్తిడిలో ఉన్నట్లు” భావిస్తోందని ఆయన అన్నారు.