సూర్యాపేట జిల్లా: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 5న తలపెట్టిన ఛలో ఢిల్లీకి కార్మికులు,కర్షకులు లక్షలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ పిలుపునిచ్చారు.
గురువారం జిల్లా కేంద్రంలోని విజయ కాలనీలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ,కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం,తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఉన్న సంపద మొత్తం అంబానీ,ఆధానీలకు కట్టబెడుతూ కార్మికులు, కర్షకులపై మోయలేని భారం మోపుతున్నారని విమర్శించారు.
కార్మిక చట్టాలను మార్చివేస్తూ నాలుగు కోడ్ లు విభజించి కార్మికుల ప్రయోజనాలకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
దేశానికి సంపదను సృష్టిస్తున్న కార్మిక వర్గానికి కనీస వేతనం రావడం లేదన్నారు.దేశానికి తిండిబెట్టే రైతన్న తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్నా,పండించిన పంటకు కనీసం మద్దతు ధర కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ కార్మికుల వలసలను నివారించేందుకు వామపక్షాల పోరాట ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని రోజురోజుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ బడ్జెట్ ను కుధిస్తూ కూలీల నోట్లో మట్టి కొడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి కూలీల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు.
నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ధరలు విపరీతంగా పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం మోపాడని ఆరోపించారు.కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం నిర్వీర్యం చేస్తున్నారన్నారు.
లాభాలలో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, అదాని వంటి శతకోటీశ్వరులకు అప్పనంగా అక్రమంగా కట్టబెడుతూ దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక,కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 5న ఢిల్లీలో జరిగే భారీ ప్రదర్శన బహిరంగ సభకు కార్మికులు,కర్షకులు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ జిల్లా సదస్సులో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జున రెడ్డి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, సిఐటియు జిల్లా అధ్యక్షులు రాంబాబు, సిఐటియు జిల్లా నాయకులు వట్టెపు సైదులు,వల్లపు దాసు సాయికుమార్,మామిడి సుందరయ్య,రణపంగా కృష్ణ,బచ్చలకూర స్వరాజ్యం,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గుంజ వెంకటేశ్వర్లు,పులుసు సత్యం తదితరులు పాల్గొన్నారు.