సూర్యాపేట జిల్లా: మోడీ సర్కార్ తీసుకొచ్చిన మూడు కొత్త చట్టాలు ‘భారతదేశ చరిత్రలో అత్యంత క్రూరమైన నేర చట్టాలు’అని నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) సూర్యాపేట పట్టణ కార్యదర్శి ఏడెల్లి శ్రీకాంత్ అన్నారు.ఏఐవైఎఫ్ జాతీయ సమితి పిలుపులో భాగంగా మంగళవారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పిఎస్ఆర్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార దురహంకారంతోనే కేంద్రం ఇలాంటి చట్టాలను తీసుకువచ్చిందన్నారు.మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి బలవంతంగా ఈ చట్టాలను ఆమోదించిందని,17 వ,లోక్ సభ గడువు మరి కొద్ది రోజులలో ముగుస్తుందనగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎవరో తరుముతున్నట్టుగా వేగంగా ఆమోదించారని,
బ్రిటిష్ పాలన నాటికంటే మరింత క్రూరమైన చట్టాలను మోదీ ప్రభుత్వం ఆమోదించి అమల్లోకి తీసుకొచ్చిందన్నారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో నాటి జాతీయ నాయకులను జైల్లో పెట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించిన‘ రాజద్రోహ’ చట్టం అమలను సుప్రీంకోర్టు 2022లో నిలిపి వేసిందన్నారు.కానీ,కొత్త చట్టంలో తిరిగి రాజ ద్రోహం చట్టాన్ని దేశద్రోహం పేరుతో తీసుకొచ్చారన్నారు.
ఇలాంటి చట్టాలన్నీ వెంటనే వెనక్కి తీసుకోకపోతే అఖిలభారత యువజన సమాఖ్య పోరాటాలకు సిద్ధమవుతుందని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో పట్టణ కోశాధికారి తాళ్ల సైదులు,శ్రీనివాస్, గాలి రామకృష్ణ,రెడ్డిమల్ల శ్రీను,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.