వ్యవసాయ విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్

సూర్యాపేట జిల్లా:జిల్లాలో 8 మండలాల్లో,ఖమ్మం జిల్లాలో ఒక మండలంలో మోటార్ల దొంగతనానికి పాల్పడ్డ దొంగల ముఠా గుట్టును కోదాడ రూరల్ సర్కిల్,అనంతగిరి పోలీసులు రట్టు చేశారు.అనంతగిరి పోలీసు స్టేషన్ నందు నమోదైన 29 కేసుల్లో 75 మాటర్లు దొంగతనం చేసినట్లు తేలడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు.

 Arrest Of Gang Of Thieves Of Agricultural Electric Motors-TeluguStop.com

ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా,మరో నలుగురు నిందితులు పరారీలో ఉండగా వారి కోసం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు.వారి వద్ద నుండి 40 మోటార్లు,రూ.2.15 లక్షల నగదు,ఒక బైక్,2 సెల్ ఫోన్స్ సీజ్ చేశారు.ఈ కేసు పూర్వపరాలను తెలియజేసేందుకు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరెంట్ మోటర్ల దొంగతనాలకు పాల్పడే నేరస్తులందరూ గతంలో ఇంటి శ్లాబులు కూలగొట్టే పనికి వెళ్ళేవారు.

అక్కడ దొరికే ఇనుప సువ్వలను కే‌జీల చొప్పున పాత ఇనుప సామాన్లు కొనేవాళ్ళకు అమ్ముకోనేవాళ్ళు.ఆ క్రమంలోనే వారందరూ ఒకరోజు ఒక పాత ఇంటి స్లాబ్ కూలగొడుతుండగా,ఆ ఇంట్లో ఒక పాడుబడిన ఎలక్ట్రికల్ మోటార్ దొరకగా,దానిని వారు గుర్తు తెలియని పాత ఇనుప వ్యాపారం చేసే ఆటో వారికి అమ్మగా సుమారు రూ.2,500/- రావడంతో అందరూ పంచుకున్నారు.అక్కడే వారి బుద్ధి గాడి తప్పింది.

ఇదేదో బావుందనుకొని కరెంట్ మోటార్ల దొంగతనం చేస్తే సులువుగా,డబ్బులు సంపాదించుకోవచ్చని అనుకున్నారు.కుటుంబ అవసరాలతో పాటు,తమ విలాసాలు కూడా తీర్చుకోవచ్చని భావించారు.

అప్పటి నుండి వారందరూ కలసి వ్యవసాయ మోటార్ల దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు.పథకంలో భాగంగా సంపంగి నవీన్ మరియు దారంగుల శ్రీను ఇద్దరు పగటి పూట వారి యొక్క మోటార్ సైకిల్ నెంబర్ AP-24AN-5132 గల దానిపై ఎక్కడెక్కడ కరెంట్ మోటర్లు ఉన్నాయో చూసుకొని వచ్చేవారు.

రాత్రి సమయాన అందరూ కలిసి శ్రీను యొక్కTS-05UA-1897 గల ఆటోలో వెళ్ళి,వారి దగ్గర ఉన్న రేంచీలు,పానాలతో మోటార్ కు ఉన్న పైప్ ను వేరుచేసి,మోటార్లను దొంగతనం చేసి,ఆటోలో వేసుకొని ఎవరికి కనబడకుండా వచ్చి,గ్రామంలో పాత ఇనుప వ్యాపారానికి ఆటోపై వచ్చే గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మేవారు.ఈ క్రమంలో మొదటగా 02-12-2021 నాడు చిలుకూరు మండలం,రామచంద్ర నగర్ గ్రామ సరిహద్దులో గల పెద్ద కాలువపై ఉన్న రెండు మోటార్లను దొంగిలించారు.

ఈ విధంగా మొత్తం 29 కేసులలో 75 మోటార్లను దొంగతనం చేశారు.ఈ రోజు అనగా తేదీ: 09.04.2022 నాడు, ఉదయం సమయంలో నవీన్,శ్రీను,యాదగిరి మరియు నాగరాజులు కలసి మొగలాయికోట గ్రామశివారులో దాచి పెట్టిన మోటార్లను తీసుకురావడానికి వెళ్ళి,ఆటోలో రెండు మోటార్లను, అలాగే ఒక మోటార్ ను మోటార్ సైకిల్ పై పెట్టుకొని నవీన్,శ్రీను లు మోటార్ సైకిల్ పై,నాగరాజు, యాదగిరి ఆటోను వేసుకొని వస్తుండగా,తెల్లవారు జామున సుమారు 4 గంటల సమయంలో అనంతగిరి గ్రామ శివారులో ఉన్న సత్య నారాయణస్వామి క్రషర్ మిల్లు వద్దకు వచ్చేసరికి పోలీస్ వారికి అనుమానం వచ్చి వారి మోటార్ సైకిల్ ను ఆపి విచారించగా వారు తమ నేరాన్ని ఒప్పుకోవడంతో ఈ దొంగల ముఠా గుట్టు రట్టు అయిందని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.మిగిలిన నేరస్తులు పరారీలో ఉన్నారని,వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు.వీరంతా కలసి సూర్యాపేట జిల్లాలో 8 మండలాల్లో మరియు ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు.29 కేసులలో 75 కరెంట్ మోటార్లను దొంగిలించిన కేసులను ఛేదించి నిందితులను పట్టుబడి చేసి రూ.2,15,000/- నగదు మరియు 40 మోటార్లు,ఒక మోటార్ సైకిల్,రెండు మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకోవడంలో కోదాడ డిఎస్పీ అధ్వర్యంలో చాకచక్యంగా వ్యవహారించిన కోదాడ రూరల్ సిఐ పి.ఎన్.డి.ప్రసాద్,అనంతగిరి ఎస్ఐ కె.సత్యనారాయణ,సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేశ్, కానిస్టేబుల్స్ రామారావు,బండి శ్రీనివాస్,కుంభం శ్రీను,జానీ పాషాలను ఎస్పీ రాజేంద్రప్రసాద్ అభినందించారు.ఈ మీడియా సమావేశంలో డిఎస్పీ రఘు,సీఐలు పి.ఎన్.డి.ప్రసాద్,ఆంజనేయులు, రామలింగారెడ్డి,నర్సింహారావు,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఎస్ఐలు సత్యనారాయణ,నాగభూషణం, రాంబాబు,సాయి ప్రశాంత్,సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube