నల్లగొండ జిల్లా: దేశంలో రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ పటిష్ట పడిందని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు.శుక్రవారం నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగబోయే హాథ్ సే హాథ్ జోడో యాత్రపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశానికి హాథ్ సే హాథ్ యాత్ర నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ,టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్యలతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ బహు నాయకత్వం పార్టీ పటిష్టతకు సంకేతమని, ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి గెలుపునకు కృషిచేయాలన్నారు.నకిరేకల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కారకర్తలు ఉత్సాహాన్ని చూస్తుంటే తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పీడీయాక్ట్ నమోదైనంత జోష్ ఉందని కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు.
కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించబోతోందని, తెలంగాణ ప్రభుత్వంలో నయీం కంటే దారుణంగా సెటిల్ మెంట్లు చేస్తూ పేదలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు.కాంగ్రెస్ అందరిదని, పార్టీలో కొత్తవారిని చేర్పించాలని,శ్రమకు తగ్గ ఫలితం ఉంటుందని, త్వరలో నిర్వహించబోయే హాథ్ సే హాథ్ జోడో యాత్రను విజవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, హాథ్ సే హాథ్ జోడో యాత్ర నకిరేకల్ ఇన్చార్జి హరికృష్ణ మాట్లడుతూ నియోజకవర్గంలో నిర్వహించబోయే హాథ్ సే హాథ్ జోడో యాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.హాథ్ సే హాథ్ జోడో యాత్రను పాదయాత్రగా చూడొద్దని, ప్రతి సమస్యను తెలుసుకునే ప్రయత్నమేనని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేసి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషిచేయాలని అన్నారు.
తదనంతరం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి,నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి కొండేటి మల్లయ్య మాట్లడుతూ అధిష్టానం సూచన మేరకు నకిరేకల్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి శాయాశక్తులా కృషిచేస్తున్నానని అన్నారు.
నకిరేకల్ నియోజకవర్గంలో నిర్వహించబోయే హాథ్ సే హాథ్ జోడో యాత్రను విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.నియోజకవర్గంలోని ప్రతి నాయకుడు గ్రామాల్లోని కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.