సూర్యాపేట జిల్లా: వరి కోతలు కాగానే మళ్ళీ సాగు చేసేందుకు రైతులు ఒకరిని చూసి మరొకరు వరి కొయ్యలకు నిప్పు పెడుతున్నారు.గత పది రోజులుగా ప్రస్తుత సీజన్ లో జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది.
వ్యవసాయ అధికారులు,ప్రజా ప్రతినిధులు చివరికి కలెక్టర్లు, ఎస్పీలు,మంత్రులు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు.వరి కొయ్యలు త్వరగా లేకుండా చేసి మరో పంటకు సిద్ధం చేసే తరుణంలో రైతులు ఈజీగా బయటపడేందుకు కొయ్యలకు నిప్పు పెట్టడం పరిపాటిగా మారింది.
ఇది ఇలా ఉంటే రెండు రోజుల క్రితం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్)మండలం నెమ్మికల్ గ్రామంలో ఓ రైతు తన పొలంలోని వరి కొయ్యలకు నిప్పు పెట్టగా పక్కనే ఉన్న వరి పొలానికి అంటుకొని ఎకరం విస్తీర్ణంలో పంట పూర్తిగా మంటల్లో కాలిపోయింది.
ఈ ఘటన సూర్యాపేట- దంతాలపల్లి ప్రధాన రహదారికి పక్కనే జరగడంతో వెంటనే స్పందించిన వాహనదారులు పక్కనే ఉన్న బావిలోని నీళ్లను తెచ్చి మంటను ఆర్పి వేశారు.
లేకుంటే పక్కనే ఉన్న ఐదు ఎకరాల పొలం కూడా పూర్తిగా మంటల్లో కాలిపోయేది.మండలంలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగినా కూడా రైతులు మాత్రం వరి కొయ్యలకు నిప్పు పెట్టడం మానడం లేదు.
ఈ మంటలతో గ్రామాల్లో పొగ,కాలుష్యం బాగా పెరిగిపోతుంది.వరి కొయ్యలు కాల్చవద్దని వ్యవసాయాధికారులు చెబుతున్నప్పటికీ రైతులు పట్టించుకోవడం లేదు.వరి కొయ్యలను కాల్చడం ద్వారా భూసారం తగ్గడంతో పాటు పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది.వరి కొయ్యలు కాల్చవద్దని గట్టి హెచ్చరికలు చేస్తే తప్ప మునుముందు ఈ ప్రమాదం నుండి రైతులు బయటపడకపోవచ్చు.
వరి పంట సాగు చేసిన పిదప కొంతమంది రైతులు నిర్లక్ష్యంగా పొలాల్లో ఉన్న వరి కొయ్యలు, పశుగ్రాసంకు నిప్పు పెడుతున్నారు.ఈ చర్యల వల్ల భూసారం తగ్గడంతోపాటు పర్యావరణానికి హాని కలుగుతుంది.
రైతులు వరి కొయ్యలకు నిప్పు పెట్టి బూడిద చేస్తున్నారు.దీంతో భూమిలో పంటకు ఉపయోగపడే కీటకాలు కూడా చనిపోయి పంటలకు తీవ్ర నష్టం కలుగుతుంది.
వరి కొయ్యలను కాల్చితే సేంద్రియ కర్బన శాతం పెరిగి గాలిలో చేరి కాలుష్యం ఏర్పడుతుంది.వరి కొయ్యలను కాల్చకుండా అలాగే పొలంలో కలియ దున్నితే సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
వరికొయ్యలను నేలలో కలియ దున్నితే సేంద్రియ శాతం పెరిగి దిగుబడులు ఐదు నుంచి 10% వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.వరి కొయ్యలను భూమిలో కలియదన్నడం వలన భూమిలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది,భూమికి నీటిని, పోషకాలను నిల్వ ఉంచే గుణం పెంచుతుంది.
వాయు కాలుష్యం జరగకుండా ఉంటుంది.కొయ్య కాలు కుల్లడంతో పంటకు ఎరువుగా ఉపయోగపడి దిగుబడులు పెరిగే అవకాశం ఉందంటున్నారు.
రైతులు వరి కొయ్యలకు నిప్పు పెట్టడం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉంటాయని మండల వ్యవసాయ అధికారి దివ్య తెలిపారు.భూసారం తగ్గి లవణాలు,పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు అంతరించిపోతున్నాయి.
గ్రామాలలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.