సూర్యాపేట జిల్లా:చింతలపాలెం మండల కేంద్రంలో కవిత కమ్యూనికేషన్ (TS-RFST 014) మీ సేవ సెంటర్ యాజమాన్యం అక్రమ వసూళ్ల దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని బాధితులు లబోదిబోమంటూ చింతలపాలెం తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ అమాయక పేద ప్రజల వద్ద నుండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అధిక డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.గత నెల 24వ,తారీఖున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విడుదల చేసిన జీవో నంబరు 58,59 ప్రకారం ఎలాంటి అభ్యంతరములు లేని ప్రభుత్వ మిగులు స్థలాల క్రమబద్ధీకరణ పథకం క్రింద ఆన్లైన్ దరఖాస్తులు చేసుకునేందుకు మీ సేవ సెంటర్ కు వెళ్ళి దరఖాస్తులు చేసుకున్నామని,దీనికి తమ వద్ద నుండి మీ సేవ నిర్వాహకులు 125 చదరపు గజాల స్థలముకు రూ.300/-మరియు 200 చ.గ.స్థలమునకు రూ.1400/-చొప్పున తీసుకొన్నారని, రశీదు ఇవ్వమని అడిగితే ఎలాంటి రశీదులు ఇవ్వమని అంటున్నారని చెప్పారు.కానీ,ప్రభుత్వ నిబంధనల ప్రకారం 125 చ.గ.లకు రూ.45/- 200 చ.గ.లకు రూ.1045/-ఉన్నట్టుగా తెలిసిందన్నారు.మీ సేవ సెంటర్ వారు మాత్రం తమ వద్ద అదనంగా డబ్బులు వసూళ్లు చేశారని తెలిపారు.గత కొంతకాలంగా ఈ మీ సేవ సెంటర్ నిర్వాహకులు మీ సేవ ముసుగులో అనేక రకాల అక్రమాలకు పాల్పడుతూ ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మీ సేవా కేంద్రంలో జిరాక్సులకు,ఆన్లైన్ సేవలకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అధిక డబ్బులు వసూళ్లు చేస్తున్నారని,అక్రమ ఆధార్ కార్డుల తయారీ,అందులో వయస్సుకు సంబంధించి తప్పుడు చేర్పులు,మార్పులు చేయడం,స్లాట్ బుకింగ్,పేద ప్రజల కళ్యాణలక్ష్మి పథకం ఆన్లైన్ పైరవీల పేరుతో వేలకు వేలు దంటుకున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.అంతే కాకుండా ఆన్లైన్ లో రాని భూములకు పైరవీలు చేసి ఆన్లైన్ చేపిస్తామని అనేక మంది దగ్గర మాయమాటలు చెప్పి మోసపూరితముగా డబ్బులు దోచుకుంటున్నారని అన్నారు.
ఈ మీ సేవా నిర్వాహకుల అక్రమ వసూళ్లపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో చింతిర్యాల బాలచంద్రుడు,చింతిర్యాల ప్రేమ్ కుమార్,చిలక నాగేశ్వరరావు,రామ ప్రభాకర్,రుద్రపంగు రమేష్,చిలక యేసు,చింతిర్యాల రవి,రామారావు,వెంకటి,గోపి ప్రసాద్,అనిల్ కుమార్,నాగమణి,కొండలు,ఎం.
గోపి, సైదులు తదితరులు పాల్గొన్నారు.