సూర్యాపేట జిల్లా:మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా రైతులకు పట్టాలు ఇవ్వాలని,రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్.ఎస్.
ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.ఆదివారం బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా గుర్రంపోడు తండాకు చేరుకున్న ఆయన భూ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బాలాజీ నాయక్ ను కలసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 540 సర్వే నెంబర్ భూములపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు ముంపు బాధితుల విషయం మరియు గుర్రంపోడు భూముల కబ్జా,రైతులపై అక్రమ కేసులు తదితర విషయాలను బాధిత రైతు ఉద్యమ నాయకులు బాలాజీ నాయక్ ఆయనకు వివరించారు.గత ఆరు సంవత్సరాలుగా ఈ ఉద్యమాన్ని తన భుజాలపై వేసుకున్న బాలాజీ నాయక్ ను ప్రవీణ్ కుమార్ అభినందించారు.
ఈ సందర్భంగా బాలాజీ నాయక్ తన వద్ద ఉన్న సమాచారాన్ని భూములకు సంబంధించిన కాగితాలను ఆర్.ఎస్.పి.కి అందించారు.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తో మాట్లాడి మీకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.గుర్రంపోడు తండా సంత్ శ్రీ సేవా లాల్ మందిరన్ని దర్శించుకుని సేవా లాల్ మహారాజ్ కు పూజలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తప్పకుండా గుర్రంపోడు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు.మొత్తం కబ్జాల విషయంలో ఒక సీబీఐ విచారణ జరిపించాలని, అక్రమంగా కబ్జాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ బీఎస్పీ ఇంచార్జీ సాంబశివ గౌడ్,నాయకులు నర్సింహ రావు,కొండలు, రైతులు లచ్చు,వశ్యా నాయక్,శంకర్,బామన, మునియ,రమేష్,చంద్రు,జగన్,హారీయ,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.