మామూళ్ల లొల్లి మామూలుగా లేదుగా!

సూర్యాపేట జిల్లా:మద్యం సిండికేట్ లో లుకలుకలు, ఎవరికెంత ఇస్తున్నారో లీక్ చేసిన సిండికేట్ మాఫియా,సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వైనం,అయినా మాకేమి తెలియదంటున్న అధికారులు,అసలు బెల్ట్ షాపులే లేవంటున్న ఎక్సైజ్ అధికారులు,ప్రధాన రహదారుల్లో,వాడవాడలా యథేచ్ఛగా బెల్ట్ షాపులు,బెల్ట్ షాపుల సంగతి అధికారులకు తెలియదట,సమాచారం ఇస్తే కేసులు చేస్తామని చెబుతున్న వైనం.కోదాడలో వైన్స్ సిండికేట్ లొల్లి ఆఫీసర్లకు ఎసరు పెట్టింది.

 Ordinary Lolly Is Not As Usual!-TeluguStop.com

సార్లకు ఇవ్వాల్సిన వాటల విషయంలో వ్యాపారుల మధ్య విభేదాలు తలెత్తడంతో వారు రచ్చకెక్కారు.ఏఏ ఆఫీసర్ కు ఎంత సమర్పించామన్న లెక్కల్లో తేడాలు రావడంతో ఓ వ్యాపారి నుంచి “మామూలు పే” పేరిట ఉన్న లిస్టు బయటకు వచ్చింది.

ఈ వ్యవహారం ఇప్పుడు కోదాడలో చర్చనీయాంశంగా మారింది.మద్యం సిండికేట్ దందాను అడ్డుకోవాల్సిన ఆఫీసర్లు మామూళ్ల మత్తులో మునిగి సిండికేట్ మాఫియాకు పూర్తిగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సిండికేట్ వ్యవహారంలో గతంలో అధికార పార్టీ నేతల హస్తం ఉండగా,ఇటీవల ఇంటలిజెన్స్ రిపోర్ట్ తమకు వ్యతిరేకంగా ఉండడంతో ఈ దందా నుంచి వారు వెనక్కి తగ్గారని సమాచారం.దీంతో ఎక్సైజ్ అధికారులు సిండికేట్ నుంచి వచ్చే మామూళ్లను భారీగా పెంచేశారని తెలుస్తోంది.

సిండికేట్ లో ఇటీవల జరిగిన గొడవలతో ఆఫీసర్ల మామూళ్ల విషయం బయటపడింది.ప్రతి మూడు నెలలకు ఒకసారి కోదాడ నియోజకవర్గం నుంచి ఆఫీసర్లకు లక్షల్లో ముడుపులు అందుతున్నాయి.

ఇటీవల జిల్లా నుంచి ట్రాన్స్ ఫర్ అయినా ఓ ఆఫీసర్ పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని బయటపడ్డట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.కోదాడ టౌన్ లో ఒక్కో ఆఫీసర్కు మూడు నెలలకు రూ.లక్షకు పైగా చెల్లిస్తున్నారంటే వారి సంపాదన ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్థమవుతుంది.జిల్లాలోని పై ఆఫీసర్ కు నెలకు లక్ష రూ.1.65 లక్షలు,ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కు రూ.1.43 లక్షలు,ఎక్సైజ్ సీఐకి రూ.45వేలు, పోలీస్ డిపార్ట్మెంట్ కు రూ.2.50 లక్షలు అందుతున్నాయని సిండికేట్ మాఫియా నుండి లీకైన దాంట్లో సారాంశం.ప్రధాన రహదారుల్లో,వాడవాడలా బెల్ట్ షాపులు దర్శనమిస్తాయి.

వైన్‌ షాప్‌ నిర్వహించాలంటే ఎన్నో నిబంధనలు,లైసెన్స్‌,పర్మిట్‌ రూమ్‌కు లక్షల్లో ఖర్చు చేయాల్సిందే.ఎమ్మార్పీ ధరకు విక్రయించడంతో పాటు సమయానికి షాపు మూసి వేయాల్సిందే.

కానీ,బెల్ట్‌ షాపుల నిర్వాహకులకు ఇవేవీ అక్కరలేదు.ఇదే తమ వ్యాపారానికి సరైన మార్గమని భావించిన వైన్‌ షాప్‌ యజమానులు గ్రామాల్లో బెల్టుషాపులు విచ్చలవిడిగా ప్రోత్సహించారు.

ఊరూరా తిరుగుతూ కూరగాయలు అమ్మినట్టు ఆటోలో తిరుగుతూ అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారు.కోదాడ నియోజక వర్గంలోని కోదాడ,మునగాల, నడిగూడెం,చిలుకూరు,అనంతగిరి,మోతె మండలాల్లో సుమారు ఐదువందలకు పైగా బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు.

వీటి ద్వారానే రోజుకు లక్షల రూపాయల వ్యాపారం సాగుతోందంటే అతిశయోక్తి కాదు.బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేయడం,వారి జోలికి ఎవరూ రాకుండా వారే తనిఖీలు చేయడం ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థనే మద్యం మాఫియా సృష్టించింది.ఇదే అదునుగా భావించిన బెల్టు షాపుల నిర్వాహకులు ఒక్కో క్వాటర్‌పై రూ.30 నుంచి రూ.40 వరకు అధికంగా వసూలు చేస్తూ ప్రజలను లూఠీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.మద్యం వ్యాపారుల సిండికేట్‌ గా మారి బెల్టు షాపులను ప్రోత్సహిస్తూ ఉంటే ఎక్సైజ్‌,పోలీస్‌ శాఖ అధికారులు మాత్రం బెల్ట్ షాపుల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం అనేక అనుమానాలు తావిస్తోంది.

ఇక ఎక్సైజ్ శాఖా అధికారులు బెల్ట్ షాపులా ఎక్కడా లేవే అని అమాయకంగా అడగడమే కాదు.సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగితే కోదాడ నియోజకవర్గ పరిధిలో ఒక్క బెల్ట్ షాపు కూడా లేదని సమాధానం ఇవ్వడంతో నియోజకవర్గ ప్రజలు షాక్ కు గురికావడం గమనార్హం.

కేవలం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో వైన్స్ బంద్ ఉంటాయి కానీ,బెల్ట్ షాపులకు అవేవి వర్తించవు.తూతూ మంత్రంగా బెల్ట్‌ షాపులు మూసివేయించినట్లు హడావుడి చేసి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది.

కనీసం ఇండిపెండెంట్ డే,రిపబ్లిక్ డే,గాంధీ జయంతి సందర్భాల్లో కూడా బెల్ట్ షాపులు నడవడం పోలీసులు వాటి గురించి పట్టించుకోక పోవడం విచారకరం.గ్రామాల్లో బెల్ట్ షాపులకు సమయ పాలన వుండదు.

నివాసాల మధ్య ఇష్టానుసారం మద్యం విక్రయాలు జరుగుతుండటంతో అనేక సమస్యలు వస్తున్నాయి.గొడవలకు దారి తీస్తున్నాయి.

గ్రామాల్లో బెల్టుషాపులు నడిపే వారికి పోలీసులన్నా,ఎక్సైజ్ అధికారులన్నా ఏమాత్రం భయం ఉండదు.వారికి వైన్స్ సిండికేట్ మాఫియా ఫుల్ సపోర్ట్ ఉంటుందనే ధీమాతో ఎవరినీ లెక్కపెట్టరు సరికదా అవసరమైతే దాడులు కూడా చేస్తారు.

ఈ స్థాయిలో మద్యం మాఫియా ఆగడాలు ఉన్నాయంటే అధికారులకు అందుతున్న అమ్యామ్యాలు నిజం కాదంటే చెవిలో పువ్వులు పెట్టుకున్నట్లేనని,బెల్టుషాపుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని మహిళలు,సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.ఇంత విచ్చలవిడిగా బెల్టుషాపులు నడుస్తుంటే బెల్ట్ షాపులు లేవని చట్టం ద్వారా సమాధానాలు ఇస్తున్న అధికారులను ఏమనాలి? ఎలా అర్థం చేసుకోవాలి?ఇప్పుడే పుట్టిన బిడ్డనడిగినా ఏ గ్రామంలో ఎక్కడ బెల్టుషాపు ఉందో చెబుతాడు.అలాంటిది బెల్టుషాపులు లేవని చెప్పడం అంటే లీకైన మామూళ్ల వ్యవహారం 100 శాతం నిజమేనని నమ్ముతున్నారు నియోజకవర్గ ప్రజలు.బెల్ట్‌ షాపులు లేవని చెబుతున్న అధికారులకు ప్రజలు ద్వారా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు.

మీరు ఏ గ్రామమైనా ఎంచుకోండి ఆ గ్రామంలో బెల్ట్ షాపులను చూపిస్తాం,బెల్ట్ షాపులుంటే మీ ఉద్యోగానికి రాజీనామా చేస్తారా?బెల్ట్ షాపు లేని గ్రామం చూపిస్తే మీకు గ్రామ గ్రామాన సన్మానం చేసి సగౌరవంగా సత్కరిస్తాం.కోదాడ నియోజకవర్గ పరిధిలోని ఎక్సైజ్, పోలీస్ అధికారులు ప్రజల సవాల్ ను స్వీకరిస్తారా? లేదా చూడాలి మరి!ఇదిలా ఉంటే కోదాడ మద్యం సిండికేట్ వ్యవహారంపై మీడియాలో వస్తున్న వరుస కథనాలపై ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు.వారు తనిఖీలకు వచ్చే సంగతి కూడా మద్యం మాఫియాకు ముందే తెలిసి ఎక్కడి దొంగలు అక్కడే గప్ చిప్ అయ్యారంటే మాఫియా నెట్ వర్క్ లో ఉన్నతాధికారులు కూడా ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.జిల్లాల నుండి కాకుండా రాష్ట్రస్థాయి టాస్క్ఫోర్స్ టీమ్ వచ్చినా సిండికేట్ మాఫియాకు ముందే తెలిసిపోవడంతో స్టేట్ టాస్క్ఫోర్స్ అధికారులు అవమానంగా భావించి లోలోన రగిలిపోతున్నట్లు సమాచారం.

ఎలాగైనా తమ తడాఖా ఏంటో చూపించాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.అదే నిజమైతే అట్లైనా బెల్ట్ షాపుల పీడ విరగడవుతుందేమో అని ప్రజలు,ముఖ్యంగా మహిళలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube