సూర్యాపేట జిల్లా: కోదాడలో బీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురైంది.డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పారదర్శకంగా లేదని లబ్ధిదారులు గులాబీ నేతల గుడ్డలూడబీకినంత పని చేశారు.
స్థానిక ఎమ్మెల్యేను,సీఎం కేసీఆర్ను దులిపారేశారు.దీనితో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
వివరాల్లోకి వెళితే…కోదాడ పట్టణంలో ఆదివారం జరిగిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణీ డ్రా లో అవకతవకలు జరిగాయంటూ అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వకుండా అన్యాయం చేశారంటూ బాలాజీ నగర్ లబ్దిదారులు కోదాడ-హుజూర్ నగర్ రహదారిపై అర్థరాత్రి రాస్తారోకో దిగారు.ఈ సందర్భంగా రహదారిపై రెండు గంటల పాటు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
తమకు న్యాయం చేయాలంటూ ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.దీనితో ఆందోళనకారులు అతనిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన కారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వారు వినకుండా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ను, ముఖ్యమంత్రి కేసీఆర్ పొట్టు పొట్టుగా తిట్టి ఉతికారేశారు.తమకు న్యాయం చేస్తానని దొంగ హామీలిచ్చి ఇప్పుడు అన్యాయం చేసి ఎమ్మెల్యే దొంగ అయ్యాడని,ఈ బీఆర్ఎస్ నాయకులు ఓట్ల కోసం వస్తే చెప్పుతో కొడతామని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు ఆడా,మగా తేడా లేకుండా ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్ కు తరలించారు.