సూర్యాపేట జిల్లా:ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతి,అక్రమాలపై జరిపిన విచారణ నివేదికను వెంటనే బహిర్గతం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు డిమాండ్ చేశారు.మంగళవారం చివ్వెంల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చివ్వెంల మండలం మున్యా నాయక్ తండ గ్రామంలో ఉపాధి హామీ పనులకు రాని కూలీలకు మస్టర్లు పేరు రాసి పేమెంట్ చేశారని ఆరోపణలు రావడంతో జూలై 22న మున్యా నాయక్ తండలో ఏపీడి పెంటయ్య సమక్షంలో విచారణ జరిపి పది రోజులు అవుతున్నా నేటికీ విచారణ నివేదికను బహిర్గతం చేయకుండా దోషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానం కలుగుతుందన్నారు.
తక్షణమే విచారణ నివేదికను బహిర్గతం చేసి దోషులను వెంటనే శిక్షించి ప్రభుత్వ ధనాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.లేనియెడల తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గుంజ వెంకటేశ్వర్లు,చివ్వెంల మండల అధ్యక్ష, కార్యదర్శులు కొల్లూరి బాబు,బచ్చలకూర రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.