సూర్యాపేట జిల్లా:రానున్న ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జై రామ్ చందర్ అన్నారు.ఈ నెల 12 వ తారీఖున హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పెద్దమ్మ తల్లి గుడి వద్ద నుండి ప్రారంభమైన సైకిల్ యాత్ర శుక్రవారం జిల్లా కేంద్రానికి చేరుకోగా జిల్లా తెలుగుదేశం కార్యకర్తలు,తెలుగుయువత కార్యకర్తలు, నల్లగొండ పార్లమెంట్ తెలుగుయువత అధ్యక్షుడు నాగేందర్ నాయుడు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా జై రామ్ చందర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినం ఈ నెల 20న ఈ సైకిల్ యాత్ర విజయవాడ చేరుకుని చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతామని వివరించారు.ప్రపంచమే తెలుగు వారి వైపు చూసేలా అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కిందన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తొమ్మిది సంవత్సరాల పాలనలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారని కొనియాడారు.వందలాది ఇంజనీరింగ్ కాలేజీలను నెలకొల్పి రైతు బిడ్డలను ఇంజినీర్లుగా దేశవిదేశాల్లో పేరు పొందేలా చేశారన్నారు.
పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబట్టి ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేసినట్లు వివరించారు.పారిశ్రామీకరణ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెంచారన్నారు.
సైబరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు,అంతర్జాతీయ విమానాశ్రయం వంటి వినూత్న అభివృద్ధి పనులతో రాష్ట్ర ప్రగతికి బాటలు వేశారన్నారు.ప్రజల వద్దకు పాలన,దీపం పథకం, జన్మభూమి,పచ్చదనం-పరిశుభ్రత,ఇంకుడుగుంతల లాంటి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా పలు రాష్ర్టాలు ఆ పథకాలను ఆదర్శంగా తీసుకునేలా చేశాడని తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్ పాలనలో రాష్ట్రాల అభివృద్ధికి దూరమయ్యాయని విమర్శించారు.యువతకు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వాలు యువతను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అంతకుముందు జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ పార్క్ పాతబస్టాండ్ పిఎస్ఆర్ సెంటర్ మీదుగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాతాల రాంరెడ్డి,రాష్ట్ర సెక్రటరీ జానకిరాములు,పట్టణ అధ్యక్షుడు పడిదల రవికుమార్,రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాధిక,వెంకట్,వీరయ్య,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.