సూర్యాపేట జిల్లా:ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మోతె తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మట్టిపెళ్లి సైదులు మాట్లాడుతూ మండల తహసీల్దార్ కార్యాలయానికి మండల వ్యాప్తంగా ప్రజలు వివిధ సమస్యల పరిష్కారం కోసం వస్తున్నారని,వాళ్ల సమస్యలను త్వరితగతిన పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
మోతె రెవెన్యూ కార్యాలయం అవినీతి అడ్డాగా మారిందని ఆరోపించారు.ప్రజలు వివిధ పనుల నిమిత్తం రెవెన్యూ కార్యాలయానికి చెప్పులు అరిగేలా తిరుగుతున్నా అధికారులు సమస్యలు పరిష్కారం చేయడం లేదని ఆరోపించారు.
డబ్బులు ఇవ్వనిదే పనులు జరగడం లేదన్నారు.ఆర్ఐ కళ్యాణ లక్ష్మి పేరుతో ప్రజల నుండి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
స్థానిక తహసీల్దార్ కొద్దిమందితో కోటరీ ఏర్పాటు చేసుకొని అక్రమ పద్ధతులలో రైతుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు.కార్యాలయంలో ఏ పని జరగాలన్నా డబ్బులు ఇవ్వవలసిందే అని అన్నారు.
ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారి విస్తరణలో మామిళ్లగూడెం గ్రామంలోని సిపిఎం పార్టీ జెండా దిమ్మె అలాగే షేక్ బేగం స్మారక స్థూపం సంవత్సరం క్రితం తొలగించారని నేటికి సంవత్సర కాలం పూర్తి అయిన నేటికీ పంచనామా చేయలేదన్నారు.సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా నేటికి పంచనామా చేసి రిపోర్ట్ ఆర్డీవో కార్యాలయం కు పంపకుండా తహసిల్దార్,ఆర్ఐలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,ఇదేమిటని అడిగితే డబ్బులు ఇవ్వనిదే పని జరగదని బహిరంగంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి అవినీతి అధికారులను తక్షణమే సస్పెండ్ చేసి,పౌర సేవలు ప్రజలందరికీ అందే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎం.గోపాల్ రెడ్డి,మండల కమిటీ సభ్యులు కిన్నెర పోతయ్య, నాగo మల్లయ్య,చర్లపల్లి మల్లయ్య,షేక్ జై హినాభి, గురజాల ఎల్లయ్య,షేక్ గౌస్,శంకర్ రెడ్డి,ఇండ్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.