సూర్యాపేట జిల్లా:జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం దందాను అరికట్టడం కోసం అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ మళ్ళీ అక్రమ రేషన్ బియ్యం దందా వెలుగులోకి వస్తూనే ఉంది.ఇటీవలే జిల్లాలో భారీ మొత్తంలో రేషన్ బియ్యం గుట్టు రట్టు చేసిన విషయం తెలిసిందే.
అయినా అక్రమ సంపాదనకు అలవాటు పడిన అక్రమార్కులు అడ్డూ అదుపూ లేకుండా రేషన్ బియ్యం దందాను కొనసాగిస్తున్నారు.గురువారం ఉదయం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్)మండలం( Atmakur (S) Mandal) పాతర్లపహాడ్ క్రాస్ రోడ్ సమీపంలోని శ్రీ లక్ష్మీ మోడరన్ రైస్ మిల్లులో అక్రమ రేషన్ బియ్యం క్రషింగ్ జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఎస్ఐ వై.సైదులు నేతృత్వంలో సోదాలు నిర్వహించారు.
రైస్ మిల్లులో సుమారు 100 క్వింటాల్ నూక,1 క్వింటా రేషన్ బియ్యం కుప్పగా పోసి ఉండడాన్ని గుర్తిచారు.
పిడిఎస్ బియ్యమా కాదా నిర్ధారణ కోసం వెంటనే సూర్యాపేట సివిల్ సప్లయ్ అధికారికి సమాచారం ఇవ్వగా డిటి నాగలక్ష్మి,సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, పంచనామా చేసి టీఏతో శాంపిల్ తీయించారు.మొత్తం పీడీఎస్ రైస్ స్వాధీన పరుచుకుని, నిల్వ ఉన్న నూకలను గోడౌన్ కు తరలించారు.
సివిల్ సప్లయ్ అధికారి డిటీ నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు రైస్ మిల్లు యజమాని కాసం రమేష్ పై కేసు నమోదు చేశామని ఎస్ఐ వై.సైదులు క్యూ న్యూస్ తో చెప్పారు.ఈ దాడిలో ఎస్బీ కానిస్టేబుల్ కిరణ్,పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.