సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో దళితులకు దళిత బంధు,మహిళలకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తూ దళితుల,మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ప్రస్తుతం రాష్ట్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు మహిళా బంధు పేరుతో సంబురాలు జరుపుకుంటున్న అధికార పార్టీ నేతలు సూర్యాపేట జిల్లాలో ఓ దళిత, మహిళా ప్రజా ప్రతినిధులకు జరిగిన అవమానకర ఘటనలపై ఏం సమాధానం చెబుతారని దళిత సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైస్ చైర్మన్ కి ఉన్న గౌరవం ఓ దళిత మున్సిపాలిటీ చైర్మన్ కి లేదా? అని దళిత సంఘాలు,ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.మంత్రి సభలో దళిత ప్రజాప్రతినిధికి అవమానం జరుగుతుంటే ఎందుకు దానిపై ఎవరూ నోరు మెదపలేదనే కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి.వివరాల్లోకి వెళితే… హుజూర్ నగర్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అధ్యక్షతన శనివారం ఎన్.ఎస్.పి క్యాంప్ నందు ఏడు కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ శంకుస్థాపన చేసిన అనంతరం మేళ్లచెరువులో ఎడ్ల పందేల పోటీలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు.అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికపైన సాక్షాత్తు జిల్లా మంత్రి,ఎమ్మెల్యే సమక్షంలో దళిత మున్సిపల్ చైర్మన్ కు కనీసం కుర్చీ కూడా ఇవ్వకుండా,వెనుక భాగంలో నిలబెట్టి అగౌరవ పరచడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన నూతనంగా ఏర్పడిన నేరేడుచర్ల మున్సిపాలిటీ.
ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఎక్కువ కౌన్సిలర్లు గెలవగా ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సైదిరెడ్డి గెలుపొందడంతో ఎలాగైనా మున్సిపాలిటీ కైవసం చేసుకునే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం లేపి ఎక్స్ అఫీషియో ఓటింగ్ తో ఎట్టకేలకు మున్సిపాలిటీ చైర్మెన్ కైవసం చేసుకున్నది టిఆర్ఎస్ పార్టీ.ఆ సమయంలో నియోజకవర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు.
నేరేడుచర్ల మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికపై ఉత్తమ్ ధర్నాకు దిగినా ఫలితం లేకుండా పోయింది.ఇలాంటి ఉత్కంఠ పోరులో ఎస్సీ కేటగిరికి చెందిన కౌన్సిలర్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు.
నేరేడుచర్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్ ను ఎన్నుకున్నారు.నేరేడుచర్ల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ కి ఉన్న గౌరవం,దళిత చైర్మన్ కి లేదనే ఆరోపణలు నియోజకవర్గంలో దండిగా వినిపిస్తున్నాయి.
ఒకానొక క్రమంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే రెడ్డి సామాజిక వర్గం కావడంతో మైనార్టీ వర్గాలను పక్కనపెట్టి,రెడ్డి సామాజిక వర్గాన్ని ముందుకు నడిపిస్తున్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు.ఇటీవల నేరేడుచర్ల సమీకృత వేజ్ & నాన్ వేజ్ మార్కెట్ శంకుస్థాపన సమయంలో 8వ వార్డు కౌన్సిలర్ దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళని వేదికపైకి ఆహ్వానించకుండా,కనీసం పేరు పెట్టి కూడా పిలవకుండా అవమానించి,కార్యక్రమానికి సంబంధంలేని వ్యక్తులతో కొబ్బరికాయలు కొట్టించి ముందువరుసలో కూర్చోబెట్టారు.
తమను పిలవకుండా,వెనుక కూర్చోబెట్టడంపై ప్రోటో కాల్ దుమారం లేచిన విషయం విదితమే.అలాగే పాలకవీడు మండలం కస్తూర్బా గాంధీ శంకుస్థాపన సమయంలో పాలకవీడు ఎంపీటీసీ దళిత వర్గానికి చెంది వికలాంగుడు కావడంతో శిలాఫలకంలో పేరు నమోదు చేసి,శంకుస్థాపనకు ఆహ్వానించకపోవడం జరిగింది.
ఇలా చెప్పుకుంటూ పోతే నియోజకవర్గంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి రెడ్డి సామాజిక వర్గాన్ని కాపాడుకుంటూ మైనార్టీ వర్గాలను పక్కన పెట్టారనే ఆరోపణలు ప్రతిపక్షాల నుండి వినిపిస్తున్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్,అధికార పార్టీ నేతలు చెబుతునట్లు టిఆర్ఎస్ పార్టీకి,ప్రభుత్వానికి దళితులపై,అందులోనూ దళిత ప్రజా ప్రతినిధులపై, మహిళలపై ప్రేమ ఉన్నట్టా లేనట్టా…? అనేది ప్రజలు,దళితులు,మహిళలు ఆలోంచించాలని దళిత సంఘాలు,మహిళా సంఘాలు,ప్రతిపక్షాల నేతలు కోరుతున్నారు.