సూర్యాపేట జిల్లా:మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావుపై పేట టీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా మాటల దాడికి దిగారు.జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిపై సంకినేని చేసిన ఆరోపణలపై శనివారం సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంకినేని ఆరోపణలపై ఎంపీపీ రవీందర్ రెడ్డి,జెడ్పిటిసి జీడీ భిక్షం,మండల పార్టీ అధ్యక్షడు శ్రీనివాస్ రెడ్డి,వైస్ ఎంపీపీ శ్రీనివాస్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎదురుదాడి చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంకినేని ఇల్లే గంజాయికి పెద్ద అడ్డా అని,సంకినేని కొడుకు వరుణ్ రావు,ఆయన బ్యాచ్ మొత్తం గంజాయికి బానిసలని,అర్దరాత్రి వరకు వాళ్ళ బ్యాచ్ మొత్తం గంజాయి కొట్టి సోషల్ మీడియాలో అడ్డమైన మెసేజ్ లు పెడతారని,సంకినేని వరుణ్ కి వైద్య పరీక్షలు నిర్వహిస్తే అన్ని నిజాలు తెలుస్తాయని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.మంత్రి జగదీశ్ రెడ్డి చేతిలో రెండుసార్లు ఓడిపోవడంతో సంకినేనికి మతిస్థిమితం తప్పిందని,ఆయనను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించాలని ఎద్దేవా చేశారు.
సంకినేని జీవితం మొత్తం కాంట్రాక్టులు,కమీషన్లమయమని, నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చడంలో సంకినేనిది అందెవేసిన చెయ్యి అని ఆరోపించారు.అవుట్ సోర్సింగ్ నియామకాలన్ని పారదర్శకంగా జరిగినవని, ఏ ఒక్కరూ డబ్బులు ఇచ్చినట్లు నిరూపించినా సంకినేనితో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఇసుక ఆదాయం ప్రభుత్వానికి వస్తుందని,టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తుంగతుర్తిలో ఇసుక దందా మొత్తం సంకినేని తమ్ముడు రవికి రాసిచ్చి అడ్డగోలుగా దోచుకున్న చరిత్ర ఆయనదని గుర్తు చేశారు.సూర్యాపేటలో జరుగుతున్న అభివృద్ధితో వ్యాపారులు సంతోషంగా ఉన్నారని,సిండికేట్లచరిత్ర సంకినేనిదేనని, గత నాయకుల్లాగా జగదీశ్ రెడ్డి ఏ వ్యాపారిని ఇబ్బంది పెట్టలేదు కాబట్టే రెండోసారి పట్టణ ప్రజలు ఆయనకు అండగా నిలిచారని చెప్పారు.
ధాన్యం కొనుగోళ్ల అవకతవకలపై బాద్యులను జైలుకు పంపిన ఘనత మంత్రిదని తెలిపారు.సూర్యాపేట చరిత్రలో ఎన్నికల్లో ఓట్లు కొనడం మొదలు పెట్టిందే సంకినేని అని,2014 ఎన్నికల్లో ఓటుకు 1000 ఇచ్చినా ప్రజలు ఓడగొట్టారని అన్నారు.
తుంగతుర్తి ప్రజలు 5 ఏండ్లకే నీ పాలనలో ఆపసోపాలు పడ్డారని,ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లేనని, సంకినేని ఎర్రగడ్డకి పోవటమే ఉత్తమమని ఉచిత సలహా ఇచ్చారు.సంకినేని ఎన్ని అబద్దాలు చెప్పినా వచ్చే ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ కూడా దక్కదని జోస్యం చెప్పారు.
ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు చౌగోని సంతోష్,మామిడి తిరుమల్, స్వామి,ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.