జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు సూర్యాపేట జిల్లా: జిల్లాలో వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ బ్యాంకర్లు, జిల్లా అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఆదిశగా బ్యాంకర్లు పంట రుణాలను అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్న వ్యవసాయ అనుబంధ రంగాలకు లక్ష్యం మేరకు రుణాలు అందించి జిల్లా ఆర్ధిక ప్రగతిలో భాగస్వామ్యం కావాలన్నారు.జిల్లాలో 70 శాతం పైబడి వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయంతో పాటు వాటి అనుబంధ రంగాలకు రుణాల మంజూరు ప్రక్రియ కొనసాగేలా బ్యాంకులు దృష్టి సారించాలని తెలిపారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో చిన్న, సన్నకారు రైతులకు పంట రుణాలు మంజూరులో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా రుణాలు వెంటనే అందించాలన్నారు.
జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు రూ.715.79 కోట్లు టార్గెట్ కాగా ఇప్పటి వరకు 533.89 కోట్ల రుణాలు అందించామని, మిగిలిన ఋణాలు మార్చి మాసాంతానికి అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లాలో వ్యవసాయ, వ్యవసయేతర,పాడి పరిశ్రమ,పారిశ్రామిక రంగాలలో లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి,వారి ఆర్ధిక స్వాలంబనకు తోడ్పాటు అందించాలని సూచించారు.జిల్లాలో వ్యవసాయ రుణాలు టార్గెట్ రూ.2452.40 కోట్లకు గాను 1928 కోట్లు రుణాలు మంజూరు చేయడం జరిగిందని, అలాగే వ్యవసాయ అనుబంధ రుణాల టార్గెట్ రూ.1217 కోట్లు కాగా 1506 కోట్ల రుణాలు అందించామని,పరిశ్రమల రంగంలో టార్గెట్ రూ.395 కోట్లు కాగా 614 కోట్ల రుణాలు మంజూరు చేశామని తెలిపారు.
విద్యా రుణాలు టార్గెట్ రూ.32.83 కాగా 13.63 కోట్ల రుణాలు ఇచ్చామని, అలాగే గృహ రుణాలు టార్గెట్ రూ.180.03 కోట్లు కాగా 51.58 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు.అలాగే ఇతర ప్రాజెక్టులు,వివిధ సెక్టర్ల కింద టార్గెట్ రూ.4794.28 కోట్లు కాగా ఇప్పటివరకు 5426.26 కోట్ల రుణాలు అందించామని, ఇప్పటివరకు అన్ని రంగాలలో 114 శాతం వృద్ధి సాధించామని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా రుణ లక్ష్యం 4700.68 కోట్లకు గాను 5374.68 కోట్లు మంజూరు చేయడం జరిగిందని స్పష్టం చేశారు.రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయం,వాణిజ్యం, విద్య,మౌలిక సదుపాయాలు,
పునరుత్పాదక,టర్మ్ లోన్లు,సూక్ష్మ,చిన్న తదితర రుణాల లక్ష్యాలు మరియు సాధించిన ప్రగతిపై సమీక్షించారు.
అలాగే జిల్లాలో మార్చికి ముందే బ్యాంకర్లు తమ లక్ష్యాన్ని అధిక మించినందుకు బ్యాంకర్లను కలెక్టర్ ఈ సందర్బంగా అభినందించారు.ఈ సమావేశంలో లీడ్ బాంక్ మేనేజర్ బాపూజీ, ఆర్బీఐ ఏజిఎం సాయి చరణ్,నాబార్డ్ ఏజిఎం సత్యనారాయణ, ఎస్బిఐ ఏజిఎం కృష్ణ మోహన్, ఏపీ జివిబి ఏజిఎం విజయ భాస్కర్,యుబిఐ డిజిఎం మురళి,జిల్లా అధికారులు రామారావు నాయక్,శ్రీధర్ గౌడ్,తిరుపతయ్య,శిరీష, శ్రీనివాస్,రమేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.