సూర్యాపేట జిల్లా:అక్రమ వ్యాపారం ఏదైనా దాని మూలాలు హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో కనిపిస్తాయి.నియోజకవర్గంలో ఏడు మండలాల్లో ఏదో ఒక అక్రమ దందా నడుస్తూనే ఉంటుందని వినికిడి.
అధికారులకు మాత్రం అంతా క్లీన్ అండ గ్రీన్ గా కనిపించడం గమనార్హం.తాజాగా పాలకవీడు మండలంలో అక్రమ రేషన్ బియ్యం దందా మూడు బొలెరోలు ఆరు లారీలుగా కొనసాగుతోంది.
ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి.కొందరు అక్రమార్కులు గ్రామాల్లో తిరుగుతూ రేషన్ బియ్యాన్ని చౌకగా కొనుగోలు చేసి గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో జాన్ పహాడ్ దర్గా,శూన్యపహాడ్ మూసి బ్రిడ్జి మీదుగా ప్రక్క ప్రాంతాలకు,వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నారు.
మండల స్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడంతోనే పేద ప్రజలకు చెందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయని మండల ప్రజల ఆరోపిస్తున్నారు.నెలల తరబడి చీకటి వ్యాపారం అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సంబంధిత అధికారులు ఉదాసీన వైఖరి మూలంగా అక్రమార్కుల ఆగడాలకు అడ్డు కట్ట పడకుండా పోతుందని విమర్శలు వచ్చిపడుతున్నాయి.పాలకవీడు మండల కేంద్రం మీదుగా గరిడేపల్లి, మఠంపల్లి నుండి రేషన్ బియ్యం అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు శూన్యపహాడ్ మూసి బ్రిడ్జి మీదుగా అక్రమ రవాణా జరుగుతుందన్నట్లు సమాచారం.ఈ రేషన్ బియ్యం వ్యాపారం చేసే ముఠా రెంటచింతల,పిడుగురాళ్ల,మాచర్ల,గురజాల నుండి ఈ ప్రాంతానికొచ్చి కూలీలతో ఊరూరు, ఇంటింటికీ తిరిగి ఒక కేజీ రూ.7 నుండి రూ.8 వరకు కొని ఆంధ్రాకెళ్లి అదే కేజీ రేషన్ బియ్యం రూ.15 నుండి రూ.18 వరకు విక్రయిస్తూ లాభాలు గడిస్తారని తెలుస్తోంది.ఈ బియ్యం అక్రమ రవాణా చేసే పెద్ద బొలెరో వ్యాన్లు,పెద్ద టాటా ఏసిజీ ఆటో వాహనాలకు నెంబర్ ప్లేట్స్ కూడ ఉండవని స్థానిక ప్రజల నుండి ఆరోపణలు వస్తున్నాయి.
రాత్రిపూట ఈ వాహనాలను అధిక స్పీడుతో నడుపుతూ రెచ్చిపోతారు.ఆ సమయంలో ఎవరైనా ఎదురుగా వస్తే ఇక వారిపని అంతే సంగతి.రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు,స్థానిక సిమెంట్ కర్మాగారంలో పని చేసే కార్మికులు,జాన్ పహాడ్ దర్గాకు వచ్చే భక్తులు రాత్రి వేళల్లో ప్రయాణం చేస్తుంటారు.అక్రమార్కుల అతి వేగం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
ఈ రోడ్డు వెంట రాత్రి వేళల్లో కరెంటు మోటార్లు వేయడానికి రైతులు కూడా పోతుంటారు.ప్రమాదాలు జరగక ముందే పిడిఎస్ బియ్యాన్ని తరలించే వాహనాల దూకుడుకు బ్రేకులు వేయాలని,బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై ఇటు సివిల్ సప్లై అధికారులు,రెవిన్యూ సిబ్బంది దాడులు చేసి పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పోలీసులు రాత్రి వేళల్లో జాన్ పహాడ్ దర్గా వైపు ఎక్కువగా పెట్రోలింగ్ గస్తీ చేపట్టినట్లైతే ఇలాంటి అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేయవచ్చని,ప్రమాదాల బారి నుండి బయటపడవచ్చని స్ధానిక పరిసర గ్రామాల ప్రజలు అంటున్నారు.