సాధారణంగా మన హిందువులు పెద్దఎత్తున ఆలయాలను సందర్శిస్తుంటారు.ఈ విధంగా ఆలయాలను సందర్శించి దేవుడు యందు తమ కోరికలను బయట పెడుతుంటారు.
అయితే ఆలయానికి వెళ్లేటప్పుడు భక్తులు ఎంతో శుచి శుభ్రతలను పాటిస్తూ ఆలయానికి వెళ్తారు.ఆలయానికి వెళ్ళిన భక్తులు ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారి దర్శనార్థం లోపలికి వెళ్తారు.
అయితే లోపలికి వెళ్లే ముందు భక్తులు ఎక్కువగా, ముందుగా గడపకు నమస్కారం చేయడం చూస్తుంటాము.అయితే ఈ విధంగా గడపకు నమస్కారం చేయడం వెనుక గల కారణం బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు.
అయితే భక్తులు ముందుగా గడపకు నమస్కారం ఎందుకు చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా దేవాలయంలోని గర్భగుడిలో గడప మన ఇంటి గడప మాదిరి చెక్కతో నిర్మించబడరు.
దేవాలయం గడపను రాతితో నిర్మించి ఉండటం మనం గమనించే ఉంటాం.ఆ రాయి పర్వతానికి చెందినది.
పురాణాల ప్రకారం భద్రుడు అనే భక్తుడు భద్రమనే పర్వతం గాను, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయం గాను, నారాయణుడు అనే భక్తులు నారాయణాద్రి గాను వెలిసినట్లు చెబుతున్నాయి.భగవంతుడు భక్తుల కోసం కొండ పై వెలిశాడు కనక ఆ కొండ నుంచి తెచ్చిన రాయిని భగవంతుడి గడపకు ఉపయోగిస్తారు.

నిత్యం భగవంతుని పుణ్యానికి నమస్కరిస్తూ అంతటి భక్తుడ్ని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవడమే గడపకు నమస్కరించడం వెనుక ఉన్న అర్థం.ఇంతటి పవిత్రమైన గడపను దాటిన్నందుకు దేవుడికి క్షమాపణ చెబుతూ గడపను నమస్కరించుకుంటారు.దేవాలయంలో ఉన్న గడపకు ఇంతటి ప్రాముఖ్యత ఉంది కనుక ఆలయంలో ప్రవేశించేటప్పుడు గడప తొక్కకూడదని చెబుతుంటారు.ఈ విధంగా గడపదాటి ముందు గడప నమస్కరించుకుని దాటాలని పురోహితులు చెబుతున్నారు.