సూర్యాపేట జిల్లా: పాలకవీడు మండలంలో ఎన్నికల కోడ్ కు ముందు ఎంపిక చేసిన దళితబంధు వివరాలను కోరుతూ 6 అంశాలతో దరఖాస్తును మండల ప్రజా పరిషత్ కార్యాలయ పౌర సమాచార అధికారికి గత నెల 11వ తేదీన ఓ దినపత్రిక ప్రతినిధి అందజేయడం జరిగింది.దరఖాస్తు చేసి నెలరోజులు గడిచినా సంబంధిత సహ చట్టం అధికారి నుండి ఎలాంటి సమాచారం రాకపోవడంతో దరఖాస్తుదారుడు నేరుగా మండల ప్రజా పరిషత్ ఆఫిస్ కు వెళ్లి సహ చట్టం అధికారి వెంకటాచారిని వివరణ కోరగా అడిగిన సమాచారం ఇవ్వకపోగా సహ చట్టం-2005 ను నీరుగార్చే విధంగా మా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాం,మీకు చెప్పాల్సిన అవసరం లేదు,మీరు కావాలంటే అప్పీల్ కి పోవచ్చని,చట్టంపై కనీసం అవగాహన లేకుండా నిర్లక్ష్యంగా పొంతలేను సమాధానం ఇచ్చారని సదరు రిపోర్టర్ చెప్పాడు.
అసలు సహ చట్టం ఏం చెబుతుంది…? సహా చట్టం -2005 ప్రకారం దరఖాస్తు చేసుకున్న నాటి నుండి 30 రోజుల్లో సంబంధిత సహ చట్టం అధికారి అడిగిన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.30 రోజులు దాటితే అందుకు అయ్యే ఖర్చు అధికారే చెల్లించి సర్టిఫైడ్ కాపీలుగా ఇవ్వాల్సి ఉంటుంది.ఇది కూడా జరగకపోతే అప్పిలేట్ అధికారికీ దరఖాస్తు చేయవచ్చు.ఇంతకీ పాలకవీడు ఎంపీడీఓ పాలసీ ఏమిటి…? మండలంలో సమాచారం కోసం సహ చట్టం కింద ఎవరు దరఖాస్తు చేసినా ఈ సారుకు సమాచారం ఇచ్చే అలవాటు లేదనే ఆరోపణలు ఉన్నాయి.మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వివరాల కోసం ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకుంటే సమాచారాన్ని పక్కదారి పట్టించడంతో స్టేట్ షార్ట్ డైరెక్టర్ కి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
పాలకవీడు మండలంలో ఎన్నికల కోడ్ ఉండగా దళితబంధు దరఖాస్తుదారుల నుండి డబ్బులు తీసుకొని ఆన్లైన్ చేసినట్లు దళిత బంధు ఎంపిక విషయంలో అవకతవకలు జరిగినట్లు ఎంపీడీవోపై జిల్లా కలెక్టర్ కీ పలు గ్రామాల దళితులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
దళిత బంధు సమాచారం బయటకు ఇస్తే ప్రజలకు అసలు వాస్తవాలు తెలిసి, అక్రమాలు బయటపడే ప్రమాదముందనే ఉద్దేశ్యంతోనే పొంతన లేని సమాధానాలు చెబుతూ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతుంది.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సహ చట్టంపై అవగాహన లేని ఈ అధికారిని వెంటనే తొలగించి,సహ చట్టం కింద అడిగిన వివరాలను అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.