సూర్యాపేట జిల్లా: సిపిఐ(ఎంఎల్)ప్రజాపంథా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అప్రకటిత విద్యుత్ కోతలు నివారించాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యుత్ ఎస్ఈకి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ర్టనాయకులు మట్టపల్లి అంజయ్య,పీ.
డీ.ఎస్.యూ రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి అప్రకటిత కరెంటు కోతలతో పంటలు ఎండిపోయి రైతుల నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు.రైతులకు ఎలాంటి కష్టాలు లేకుండా కేసీఆర్ 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తానని ప్రగల్భాలు పలికి అప్రకటిత కరెంటు కోతలు విధిస్తూ అన్నదాతలను ఆగం పటిస్తిండని మండిపడ్డారు.
కరెంటు ఎప్పుడు ఉంటుందో ఉండదో తెలియక రైతులు సతమతవుతుంటే అసెంబ్లీలో మాత్రం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నామని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.ఇప్పటికే అనేక చోట్ల పంటలు ఎండిపోయి రైతులు నిరాశకు గురవుతున్నా, రైతులను పట్టించుకొనే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదన్నారు.
ఇకనైనా రైతులు నష్టపోకముందే కరెంట్ సక్రమంగా అందించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో రైతులతో కలిసి రాష్ర్ట వ్యాప్తంగా కరెంటు ఆఫీస్ లు ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా రాంజీ,పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి,ప్రజాపంథా పట్టణ కార్యదర్శి గులాంహుస్సేన్, జీవన్,వాజిద్,నగేష్,బావ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.