సూర్యాపేట జిల్లా: సూర్యాపేట పట్టణ మరింత సుందరీకరనే తమ లక్ష్యమని,అందుకోసం ఎన్ని నిధులైన వెనుకాడేది లేదని,నాణ్యతలో ఏమాత్రం రాజీపడమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత సూర్యాపేట పట్టణం దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో అందుకు తగిన విధంగా పట్టణాన్ని రూపందించుకోవడంలో అన్ని వర్గాల ప్రజలు,రాజకీయ నాయకులూ రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మంగళవారం పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో జరిగిన మాస్టర్ ప్లాన్ పునర్విభజన సమావేశానికి మంత్రి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణాన్ని మరింత సుందర పట్టణంగా తీర్చిదిద్దుకుని,భావితరాలకు అద్భుతమైన పట్టణాన్ని అందించడం సాధ్యమవుతుందన్నారు.సూర్యాపేట మున్సిపాల్టీలో 1982 లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ నేటికీ అమలులో ఉండటం,గతంలో వున్న పాలకులు,అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే పట్టణంలో రోడ్లు ఇరుకుగా మరాయన్నారు.1982 కంటే ముందు పట్టణంలో పాత రోడ్లు 40 ఫీట్లు వుండేవని ఆ తర్వాత రోడ్లు కుంచించుకొనిపోయి చిన్న చిన్న రోడ్లుగా మారాయని, ప్రజలు వీటిని గుర్తించాలన్నారు.ఇప్పటికైనా మన మాస్టర్ ప్లాన్ ను సరిచేసుకొని భవిషత్తు తరాలకు సుందరమైన పట్టణాన్ని అందించుకుందామన్నారు.సూర్యాపేట పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు అంశాన్ని గురించి పరిశీలిస్తామన్నారు.