సూర్యాపేట జిల్లా: మాదిగలను నమ్మించి మోసం చేస్తూ ఎస్సీ వర్గీకరణపై నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాలకు రాజకీయ పతనం తప్పదని ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు.మంగళవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెస్ జూనియర్ కళాశాలలో ఎంఎస్పి రాష్ట్ర అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఎంఎస్పి,ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలో సంపూర్ణ మెజారిటీతో అధికారం కలిగి ఉండి ఎన్నో బిల్లులను,రాజ్యాంగ సవరణలను ఆమోదింప చేసుకుంటున్న బీజేపీ ఒక్క ఎస్సీ వర్గీకరణ పట్ల మాత్రమే నిర్లక్ష్యం చేస్తోందన్నారు.29 ఏండ్లుగా ఎమ్మార్పీఎస్ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపి,కేంద్రంలో అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా బీజేపీ వ్యవహరించడం నమ్మక ద్రోహానికి నిదర్శనమన్నారు.
ఎస్సీ వర్గీకరణ చేయకుండా బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని మాదిగల ఓట్లు అడగడానికి వస్తారని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యదిక జనాభా కలిగి ఉన్నది మాదిగలు మాత్రమేనని, అలాంటి మాదిగలకు నమ్మక ద్రోహం చేసి బీజేపీ తెలంగాణలో ఎట్లా అధికారంలోకి వస్తుందో చూస్తామని అన్నారు.మాదిగలను నమ్మించి మోసం చేసిన బీజేపీ మాత్రమే మాదిగలకు ఏకైక రాజకీయ శత్రువని అన్నారు.
కనుక బీజేపీ నేతలను మాదిగ వాడల్లోకి రానివద్దని,మాదిగ బిడ్డలంతా ఏకత్రాటి మీద ఉండి బీజేపీ మీద యుద్ధం చేయాలని అన్నారు.ప్రజా గోస -బీజేపీ భరోసా యాత్ర చేస్తున్న బీజేపీ నేతలు మాదిగలకు ఇచ్చిన భరోసా ఏమైందో చెప్పాలని,మాదిగలు పడుతున్న గోసకు బీజేపీ కారణం కాదా ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు.
ప్రజా గోస-బీజేపీ భరోసా యాత్ర పేరు కాకుండా నమ్మక ద్రోహ యాత్ర అని పేరు పెట్టుకోవాలని అన్నారు.
తక్షణమే బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకొని పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు.
వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యమం మరింత ఉదృత రూపం దాల్చుతుందని అన్నారు.ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిన్న చేపట్టిన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధం చేయడం యుద్ధంలో కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో బీజేపీ మీద పోరాటం ఉదృత రూపంగా ఉంటుందన్నారు.
మాదిగల ఆకాంక్షను పట్టించుకోకుండా,ఇంకా నమ్మక ద్రోహానికి పాల్పడితే మాదిగల చేతిలో బీజేపీకి రాజకీయ పతనం తప్పదని హెచ్చరించారు.రేపు భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు డా.మున్నంగి నాగరాజు మాదిగ,ఎంఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు వైకే విశ్వనాధ్ మాదిగ,తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగ,జాతీయ అధికార ప్రతినిధి బొర్ర భిక్షపతి మాదిగ,ఎంఎస్పి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి కందుకూరి సోమన్న, ఎంఎస్పి సూర్యాపేట జిల్లా ఇన్చార్జి యాతాకుల రాజయ్య,ఎంఎస్పి నియోజకవర్గ కోఆర్డినేటర్ ఏపూరి రాజు మాదిగ, ఎంఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు,ఎంఎస్పి రాష్ట్ర నాయకులు యలమర్తి రాము,వడ్డేపల్లి కోటేష్,కొత్తపల్లి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.