రాజన్న సిరిసిల్ల జిల్లా: నిరుద్యోగులకు, పట్టభద్రులకు సేవలు చేయడానికి ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నానని పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపిస్తే నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం, విద్యార్థులకు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలలో నామమాత్రపు ఫీజులతో విద్యను అందించేలా కృషి చేస్తానని ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో తమను గెలిపించాలని ప్రచారాన్ని చేశారు.
మండల కేంద్రంలోని విజ్ఞాన్ పాఠశాలలో కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శేఖర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు.
విద్యార్థులకు స్కాలర్షిప్ లు, ఫీజు రియంబర్స్మెంట్ లో పెండింగ్ లో ఉన్నాయని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంతో కొట్లాడైనా సాధించేందుకు కృషి చేస్తానన్నారు.ప్రవేట్ పాఠశాలల రాష్ట్ర అధ్యక్షునిగా నాలుగు సంవత్సరాలు పనిచేసి రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలలో మంచి నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.20 సంవత్సరాల నుండి ట్రస్మా లో ఉంటూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సందర్శించడం జరిగిందన్నారు.ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రుడు తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపిస్తే, గెలిచాక నిరుద్యోగులకు అన్యాయం చేయకుండా ఉద్యోగాల కోసం ప్రభుత్వంతో పోరాటం చేసి ఉద్యోగాలు వచ్చేలా ఉద్యమాలు చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు తెడ్డు రవి, విజ్ఞాన్ పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ లతీఫ్, ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్, సంతోష్ కుమార్, పీఈటి భరత్ కుమార్, రాకేష్ లు పాల్గొన్నారు.