సూర్యాపేట జిల్లా:ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు ధరల మీద ధరలు పెరిగే నాగులో నాగన్న ఈ ధరల మీద మన్నుబోయ నాగులో నాగన్న అనే గీతం ప్రస్తుత కూరగాయల ధరలకు కరెక్ట్ గా సరిపోతుంది.వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లా( Suryapet District ) వ్యాప్తంగా కూరగాయల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చి సామాన్యుడు కూరగాయలతో భోజనం చేసే అవకాశం లేకుండా పోయిందని జిల్లా ప్రజలు వాపోతున్నారు.
జిల్లాలో కూరగాయల ధరలను పరిశీలిస్తే కేజీ దోసకాయ 100,కేజీ టమాట( Tomato) అరవై, కేజీ పచ్చిమిర్చి రూ.150, కేజీ బీరకాయ 100,కేజీ వంకాయ 80,కేజీ సోరకాయ 50,కేజీ దొండ 100,కేజీ బెండ వంద రూపాయలు ఉండటంతో సామాన్యుడు కొనలేని పరిస్థితి నెలకొంది.పచ్చడ మెతుకులనే పరమాన్నంగా భావించి స్థితికి ప్రజలు వచ్చారు.మామూలు రోజుల్లో రూ.100 లకు సంచినిండా వచ్చే కూరగాయలు,నేడు వంద రూపాయలు పెడితే కనీసం కేజీ దోసకాయ కొనే పరిస్థితి లేదని,ధరలు ఆకాశనంటుతున్నా,పేద, బడుగు బలహీనవర్గాలకు కూరగాయలు కుంపటి రాజేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని,ధరలు ఇలాగే కొనసాగితే బీదవాడు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కూరగాయల ధరలతో పాటు మాంసాహార ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి.కేజీ మటన్ రూ.800, కేజీ చాపలు రూ.250,కేజీ చికెన్ రూ.280 పలుకుతున్నాయి.పెరిగిన ధరలతో సామాన్య,మధ్య తరగతి కుటుంబాలు వాటిజోలికి పోయే పరిస్థితి కనిపించడం లేదు.ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి కూరగాయల, మాంసాహార ధరలను నియంత్రణలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.