సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలంలోని సాగర్ సిమెంట్ పరిశ్రమ మైనింగ్ విస్తరణ కొరకు శనివారం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు( S Venkatarao ) అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.326.58 హెక్టార్లు విస్తరణ చేపట్టనున్నారని,ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మాట్లాడిన వారు ఎక్కువగా విద్య,వైద్యం పట్ల దృష్టి సారించాలని,స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.సాగర్ సిమెంట్స్ నందు పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.పర్యావరణ పరిరక్షణ కొరకు విరివిగా మొక్కలు నాటాలని కోరారని కలెక్టర్ తెలిపారు.ఈ ప్రజాభిప్రాయ సేకరణలో 56 మంది తమ అభిప్రాయాలను తెలిపారని,ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయంలో ప్రజలు వ్యక్తపరిచిన విషయాలు లైవ్ రికార్డు చేయడం జరిగిందని, వాటన్నింటిని యధాతధంగా పర్యావరణ శాఖకు పంపడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ప్రజలు ఎక్కువగా వైద్యం గురించి అడిగారని తప్పకుండా పరిశ్రమల వారితో మాట్లాడి ఆస్పటల్ నిర్మించి క్యాన్సర్ గుండె సంబంధించిన వ్యాధులకు డాక్టర్లను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు.
పర్యావరణ శాఖ అధికారులు రెవెన్యూ సిబ్బంది జాయింట్ గా పరిశ్రమల పరిధిలోని గ్రామాలను గుర్తించి రెడ్ జోన్,గ్రీన్ జోన్లుగా గుర్తించాలన్నారు.సిఎస్ఆర్ నిధులతో చేసిన పనులయొక్క సూచికలను ఏర్పాటు చేయాలన్నారు.
భూ సమస్యల పట్ల పరిష్కార భావంతో మెలగాలన్నారు.పెదవీడుకు చెందిన రైతులు 12 మంది హైకోర్టులో పిటిషన్ వేశారని వారిని నేరుగా ప్రజాభిప్రాయ సేకరణకు పిలిచినా అందుబాటులోకి రాలేదన్నారు.
వారు అవసరమైతే రాతపూర్వకంగా అందించవచ్చన్నారు.పరిశ్రమ తరపున ప్రసాద్ రావు మాట్లాడుతూ ప్రజలు తెలిపిన విధంగా అధికారులు సూచించిన మేరకు విద్య, వైద్యం,ఉపాధి కొరకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు.
పరిశ్రమల వల్ల ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో డీఎఫ్వో సతీష్ కుమార్,హుజూర్ నగర్ ఆర్డీవో జగదీశ్ రెడ్డి,పర్యావరణ శాఖ ఈఈ సురేష్ బాబు, తాహసిల్దార్ మంగ,పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.