కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామ శివారులో ఇద్దరు వ్యక్తులు తాము ఎక్సైజ్ పోలీసులమని ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట (NTR District ,Jaggaiyapet )మండలం గండ్రాయి గ్రామానికి చెందిన సయ్యద్ ఇస్మాయిల్ ను బెదిరించి డబ్బులు తీసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
శుక్రవారం సయ్యద్ ఇస్మాయిల్(Sayyad ismayil) వ్యక్తిగత పని నిమిత్తం బైక్ పై కోదాడకు వచ్చి తిరిగి ఇంటికి వెళుతుండగా ద్వారకుంట సమీపంలో ఉన్న దర్గా వద్ద నడిగూడెం మండలం రత్నావరం గ్రామానికి చెందిన బెల్లంకొండ వినయ్(Bellamkonda Vinay),కోదాడ పట్టణం సాలార్జంగ్ పేటకు చెందిన ఎస్కే మతీన్ (SK Mateen) బైకును వెంబడించి అతనిని అడ్డుకున్నారు.తాము ఎక్సైజ్ శాఖ పోలీసులమని తనిఖీ చేయాలని బెదిరించారు.
నువ్వు గంజాయి తాగినట్లు సమాచారం ఉందని,నిన్ను స్టేషన్ కి తీసుకొని రమ్మని సిఐ పంపించారని బుకాయించారు.
నిన్ను వదిలేయాలంటే రూ.1000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.దీనితో బెదిరిపోయిన బాధితుడు తొలుత రూ.వెయ్యి ఇచ్చాడు.అంతటితో ఆగకుండా మళ్ళీ బెదిరించి తర్వాత రూ.2500 ఫోన్ పే చేయించుకున్నారు.అది కూడా సరిపోదంటూ సిఐ ఇంకా సీరియస్ గా ఉన్నారని మరింత భయపెడుతూ అతని ఫోన్ లాక్కొని ఫోన్లో ఉన్న నెంబర్ల ద్వారా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ వాడిని గంజాయి కేసులో అనుమానంతో పట్టుకున్నామని వెంటనే మీరు రూ.5000 తీసుకొని రావాలని లేకుంటే కేసు చేస్తామని బెదిరించారు.దాంతో వారు మరో రూ.1000 ఫోన్ పే(PhonePe) ద్వారా పంపించారు.ఇదంతా గమనించిన బాధితుడు వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు మొదలు పెట్టారు.
ఫోన్ పే నెంబర్ల ఆధారంగా ఇద్దరు నకిలీ ఎక్సైజ్ పోలీసులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు.