సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎస్సి కమ్యూనిటీ హల్ భవన నిర్మాణం పూర్తి అయినా ప్రారంభానికి నోచుకోక వినియోగంలోకి రాలేదని ఎస్సీ కాలనీ వాసులు వాపోతున్నారు.కమ్యూనిటీ అవసరాల కోసం ప్రభుత్వ నిధులు వెచ్చించి భవనాన్ని నిర్మిస్తే సంవత్సరాలు గడుస్తున్నా ప్రారంభించడానికి అధికారులకు తీరిక లేకుండా పోయిందని, అంతా సిద్ధమైనా ఆలస్యం దేనికని ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో కొత్త భవనాలు నిర్మించుకునేందుకు నిధులు లేక ఎదురుచూపులు చూస్తుంటే ఈ గ్రామంలో మాత్రం నిర్మాణం పూర్తి అయిన భవన ఓపెనింగ్ కు అడ్డంకులు ఏమిటో అర్దం కావడం లేదని అంటున్నారు.వినియోగంలోకి తేకుండా నిరుపయోగంగా ఉంచితే త్వరగా శిథిలావస్థకు చేరే అవకాశం ఉందని, ఇప్పటికైనా పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ చొరవ తీసుకొని వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు.