సూర్యాపేట జిల్లా:ప్రైవేట్ హాస్పిటల్స్,స్కానింగ్ సెంటర్లలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం హెచ్చరించారు.బుధవారం కోదాడ పట్టణంలోని పలు స్కాన్ సెంటర్ లను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం పరిశీలించి,రికార్డులను తనిఖీ చేసి,స్కానింగ్ రిపోర్ట్స్ ను పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్ల వారు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని,అబార్షన్ల అంతం వైద్యఆరోగ్యశాఖ పంతం అని అన్నారు.లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆధారాలు దొరికితే అట్టి ఆసుపత్రులను మరియు స్కాన్ సెంటర్ లను సీజ్ చేస్తామని,జిల్లా కలెక్టర్ కి రాష్ట్ర అధికారులకు పూర్తి వివరాలతో నివేదిక అందజేస్తామని అన్నారు.
అబ్బాయిలు కావాలని ఏ గర్భిణీ స్త్రీ గాని,వారి కుటుంబ సభ్యులు గానీ,గర్భిణీ స్త్రీ యొక్క అమ్మ,అత్త ఇంకా సంబంధిత సభ్యులు ఎవరైనా లింగ నిర్ధారణకు ప్రయత్నిస్తే అట్టి వారిపై పోలీసు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.సిబ్బంది ఎవరైనా సహకరించినట్లు తెలిస్తే వారి సర్టిఫికెట్లు రద్దు చేస్తామని అన్నారు.
జిల్లాలోని ప్రతి స్కానింగ్ సెంటర్ వివరాలు వారు చేస్తున్న స్కాన్ లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.అబార్షన్లు చేస్తున్నట్లు సమాచారం అందించిన వారికి ప్రత్యేక బహుమానం ఇస్తామని ప్రకటించారు.
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడం కోసం ఆస్పత్రులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు,ప్రోగ్రాం అధికారులను కలెక్టర్ ఆదేశాలపై ప్రత్యేకంగా నియమించనున్నట్లు తెలిపారు.వైద్యులు కానివారు అబార్షన్లు చేస్తున్నారని అలా ఎవరైనా ఆర్ఎంపీలు అబార్షన్లు చేస్తున్నట్లు దృష్టికి వస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
అట్టి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచి చట్ట పరిధిలో వారిని శిక్షించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ వో డాక్టర్ నిరంజన్,జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి,డెమో అంజయ్య,జిల్లా మేనేజర్ భాస్కర్ రాజు,వైద్యులు,ఇతర అధికారులు ఉన్నారు.