సూర్యాపేట జిల్లా:ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం మనకిచ్చిన అత్యంత విలువైన,శక్తివంతమైన ఆయుధమని, ఈ అవకాశాన్ని భారత ఎన్నికల కమీషన్ ద్వారా మనకు కల్పించిందని జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు బుధవారం జిల్లా కలెక్టరేట్ నుండి విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొన్నారు.18 ఏళ్ళు నిండిన వారందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని,గత జనవరి 6 నుండి సెప్టెంబర్ 30 వరకు ఓటరు జాబితాలో మార్పులు,చేర్పులు,అభ్యంతరాలపై 4 నియోజకవర్గాలలో దరఖాస్తులు పరిశీలించి,జాబితా సవరించామని అన్నారు.బుధవారం ప్రకటించిన డ్రాఫ్ట్ పబ్లికేషన్ నాటికీ జిల్లా మొత్తం 9,13,800 (పురుష,మహిళా)మంది ఓటర్లు,475 మంది సర్వీసు ఓటర్లున్నారని,అందులో హుజుర్ నగర్ నియోజకవర్గంలో 2,33,126 మంది ఓటర్లు,115 మంది సర్వీసు ఓటర్లు,కోదాడ నియోజకవర్గంలో 2,24,066 మంది ఓటర్లు,114 మంది సర్వీసు ఓటర్లు,సూర్యాపేట నియోజకవర్గంలో 2,20,615 మంది ఓటర్లు,101 మంది సర్వీస్ ఓటర్లు,తుంగతుర్తి నియోజకవర్గంలో 2,35,993 మంది ఓటర్లు,145 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారన్నారు.
ఈ జాబితాను బ్లాక్ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్ లలో ప్రదర్శించామని, జనవరి 5 2023 న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని, ఈ తుది జాబితానే అన్ని ఎన్నికలకు ప్రామాణికంగా ఉంటుందని తెలిపారు.కాబట్టి ప్రజాప్రతినిధులు జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి యువత ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కలిగించాలని,ఓటరుకార్డు కలిగినవారు ఆధార్ కార్డు అనుసంధానం చేసేలా చూడాలన్నారు.
వందశాతం పూర్తయ్యేలా మరింత కృషి చేయాలని కోరారు.ఈ నెల 26,27,డిసెంబర్ 10,11 తేదీలలో ఓటరు నమోదు జాబితా మార్పులు,చేర్పులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నామన్నారు.ఆరు మాసాల నుండి కుటుంబంతో ఎక్కడ నివసిస్తున్నారో అక్కడ సాధారణ నివాసిగా పరిగణింపబడతారని,అక్కడ ఓటు హక్కు కలిగి ఉండాలని,ఆ విధంగా ఆధార్ అనుసంధానం చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు.భారత ఎన్నికల కమీషన్ ప్రతి ఎన్నికలలో నూతనత్వంతో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించుటకు ముందుకెళ్తుందన్నారు.
స్పెషల్ సమ్మరి రివిజన్ పరిశీలనలో భాగంగా గత అక్టోబర్ 19 న కేంద్ర ఎన్నికల కమీషన్ డిప్యూటీ ఎన్నికల కమీషనర్ సూర్యాపేట జిల్లాలో స్వీప్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యాకలాపాలు,ఓటరు నమోదు,ఆధార్ అనుసంధానం బాగా జరిగిందన్నారు.