సూర్యాపేట జిల్లా:నార్మల్ డెలివరీ జరిగిన శిశువుకు వైద్యం అందించడానికి డాక్టర్లు అందుబాటులో లేక నర్సులు వైద్యం చేయడంతో నవజాత శిశువు మృతి చెందిన సంఘటన హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది.బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాకు చెందిన జిల్లా నాగరాజు భార్య రేణుక గత ఆదివారం మొదటి కానుపు ప్రసవ నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ లో హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది.ఆ సమయంలో విధుల్లో ఉన్న నర్సులు నిండు గర్భిణి నొప్పులతో బాధపడుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినా నార్మల్ డెలివరీతో మగబిడ్డకు జన్మనిచ్చింది.
నర్సులు డెలివరీ ఆలస్యం చేయడంతో శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఈ ఆరోపణలపై బుధవారంజిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోటా చలం హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి సందర్శించి విచారణ చేపట్టారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యులు డెలివరీ ఆలస్యం చేయడంతో శిశువు మృతి చెందినట్టు ఆరోపణలు రావడంతో విచారణ చేస్తున్నామన్నారు.హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీ జరిగిందని,స్పెషలిస్ట్ డాక్టర్ కూడా పరిశీలించారని,అప్పుడే పుట్టిన బేబీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు.
అందుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా రికార్డ్ అయినట్లు తెలిపారు.సిబ్బంది,స్టాఫ్ నర్సులు,డాక్టర్లు వైద్యం అందించినట్లు తెలుస్తుందని,దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులు ఎంత వారైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
వైద్య సిబ్బంది అందరితో స్నేహభావంతో ఉండాలని, ఎవరి పట్ల దురుసుగా వ్యవహరించొద్దని సూచించారు.జిల్లా ఏరియా ఆసుపత్రిలో కూడా విచారణ చేస్తామని అవసరమనుకుంటే బేబీ పోస్ట్ మార్టం కూడా చేసి వివరాలు సేకరిస్తామని స్పష్టం చేశారు.
తల్లి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని,ఏమైనా ఇబ్బంది అనుకుంటే జిల్లా ఆసుపత్రికి తరలిస్తామన్నారు.తల్లి ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు.